
ఆధునిక జీవనశైలిలో మన ఆహారపు అలవాట్లు నెమ్మదిగా మారుతున్నాయి. వేగవంతమైన జీవితం, తక్షణ తృప్తికి అలవాటు పడటం వంటివి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కొన్ని ఆహార పదార్థాలు మనం ప్రతిరోజూ నిర్లక్ష్యంగా తీసుకుంటున్నాం. వైద్య నిపుణుల సూచనల ప్రకారం, ఈ ఆహారాలు జ్ఞాపకశక్తిని తగ్గించి మతిమరుపునకు కారణమవుతున్నాయి. అందుకే మెదడు పనితీరు బాగుండాలంటే ఈ ఆహారాలను నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది.
బేకన్, సాసేజ్, సలామీ లాంటి ప్రాసెస్ చేసిన మాంసాల్లో హానికరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు తత్వాన్ని దెబ్బతీసే రసాయనాలను విడుదల చేస్తాయి. దీర్ఘకాలికంగా వీటిని తరచుగా తీసుకుంటే మెదడు పనితీరు మందగిస్తుంది. అల్జీమర్ వంటి నెరాసంబంధిత వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి.
అలాగే, స్వీట్‌లు, శీతల పానీయాలు, చాక్లెట్లు వంటి అధిక షుగర్ ఉండే ఆహారాలు మెదడుకు తాత్కాలికంగా ఎనర్జీ ఇచ్చినా, దీర్ఘకాలంలో నెగెటివ్ ప్రభావం చూపిస్తాయి. ఇవి మెదడు నాడీవ్యవస్థను దెబ్బతీసి, జ్ఞాపకశక్తి తగ్గింపుకు కారణమవుతాయి. ఇక రోజువారీగా ఎక్కువ ఉప్పు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తపోటు (BP) సమస్యలే కాక, మెదడు ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక ఉప్పు నాడీ సంబంధ వ్యాధులకు, మతిమరుపు లక్షణాలకు కారణమవుతుంది.
ఇక బజార్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, ఇంకా బాగా వేయించి ఆహారపదార్థాలు అందులోని ట్రాన్స్‌ఫ్యాట్లు మెదడు పనితీరును మందగించేలా పని చేస్తాయి. ఇవి మతిమరుపు లక్షణాల మొదటి దశల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ముఖ్యంగా అధికంగా మద్యపానం చేయడం మెదడులోని నాడీ సంబంధిత వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీర్ఘకాలంగా తాగే అలవాటు జ్ఞాపకశక్తిని పూర్తిగా దెబ్బతీయవచ్చు. డెమెన్షియా, అల్జీమర్ వంటి వ్యాధులకు ఇది ప్రధాన కారణాల్లో ఒకటి.
మొత్తంగా.. సరిగ్గా నియంత్రణలేని ఆహారపు అలవాట్లు మన మెదడుపైనా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆరోగ్యవంతమైన ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతత ద్వారా మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మెమరీ లాస్‌ను నివారించాలంటే ఈ హానికరమైన ఆహారాల జాబితా నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి.