ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎంతో అరుదైన జంతువులు అరణ్యం నుంచి జనావాసంలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. మరికొన్ని క్రూర మృగాలు సైతం జనారణ్యంలోకి వచ్చి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే జనగామ జిల్లా కేంద్రంలో ఓఅరుదైన జాతికి చెందిన గుడ్లగూబ ప్రత్యక్షమయింది.ఈ అరుదైన జాతికి చెందిన గుడ్లగూబను చూడడానికి స్థానికంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కీకారణ్యంలో నివసించేటటువంటి ఓ అరుదైన జాతికి చెందిన గుడ్లగూబ రెక్కకు గాయమవడంతో ఎటు కదలలేని పరిస్థితుల్లో జనగామ జిల్లాలో కనిపించింది.                                                                                                     

జనగామలోని బతుకమ్మకుంటలో కదలలేని స్థితిలో ఉన్న గుడ్లగూబను చూసిన స్థానికులు దానిని చేరదీసి ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. ఈ గుడ్లగూబ గోధుమ రంగులో ఉండి, పెద్ద కళ్లను, పొడవాటి ముక్కును కలిగి ఉంది. ఈ విధంగా అరుదుగా కనిపించేటటువంటి ఈ గుడ్లగూబలు కేవలం రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయని, పగలు ఈ గుడ్లగూబలు సంచరించవని అటవీశాఖ అధికారులు తెలియజేశారు.

ఇది ఒక అరుదైన మాస్క్డ్ గుడ్లగూబ జాతికి చెందిన పక్షి అని అటవీశాఖ అధికారులు తెలియజేశారు. ఈ గుడ్లగూబను స్వాధీనం చేసుకున్న అధికారులు దానికి గాయం తగ్గేవరకు చికిత్స అందించి అనంతరం గాయం తగ్గిన తరువాత గుడ్లగూబను అడవిలో వదులుతామని అటవీ అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ప్రమాదంలో పడి ఉన్న గుడ్లగూబను రక్షించి అధికారులకు తెలియజేయడం పై స్థానిక ప్రజలను అటవీశాఖ అధికారులు ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: