జీడిపప్పు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది దాని అద్భుతమైన రుచి. పాయసం నుంచి బిర్యానీ వరకు ఏ వంటకంలో వేసినా ఆ రుచే వేరు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఇందులో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి కొన్ని తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారు జీడిపప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

 ఇందులో క్యాలరీలు మరియు కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి, కాబట్టి పరిమితికి మించి తింటే శరీర బరువు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే, చాలామంది మార్కెట్లో దొరికే ఉప్పు వేయించిన (Salted) జీడిపప్పును అమితంగా ఇష్టపడతారు. ఇలాంటి ప్రాసెస్ చేసిన జీడిపప్పు తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి, రక్తపోటు (High BP) సమస్యలకు దారితీస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు కూడా కారణం కావచ్చు.

జీడిపప్పులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరినప్పుడు కాల్షియం గ్రహించబడకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు జీడిపప్పుకు దూరంగా ఉండటమే మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అలర్జీలు. కొంతమందికి జీడిపప్పు తినగానే చర్మంపై దద్దుర్లు రావడం, దురద, వాంతులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 దీనిని 'నట్ అలర్జీ' అంటారు, ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. జీడిపప్పు అతిగా తింటే జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ పరిమితి దాటితే కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొంతమందిలో ఇది మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఏ పదార్థమైనా 'అతి సర్వత్ర వర్జయేత్' అన్నట్లుగా, జీడిపప్పును కూడా రోజుకు 4 నుండి 5 పలుకుల కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండటమే ఆరోగ్యానికి క్షేమకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: