చికెన్ అనగానే మనందరికీ ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చికెన్ వంటకం ఉండాల్సిందే. ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారం కాబట్టి చాలామంది దీనిని ప్రతిరోజూ తినడానికి కూడా వెనకాడరు. అయితే ఎంత రుచిగా ఉన్నా, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందని అనుకున్నా.. ఏదైనా సరే అతిగా తింటే ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 100 నుంచి 150 గ్రాముల చికెన్ తీసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే నెలకు సుమారు 3 నుండి 4 కిలోల చికెన్ సరిపోతుంది. కానీ మనం హోటళ్లలో దొరికే బిర్యానీలు, ఫ్రైడ్ చికెన్, మసాలా దట్టించిన కర్రీలను ఇష్టంగా తింటుంటాం. ఇలా పరిమితికి మించి చికెన్ తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. చికెన్ స్వతహాగా వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి అతిగా తింటే ముక్కు నుంచి రక్తం కారడం, మొటిమలు రావడం, జీర్ణక్రియలో ఇబ్బందులు కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
అంతేకాకుండా, చికెన్‌లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. రోజూ చికెన్ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తపోటు (బిపి), గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా బాయిలర్ కోళ్లను పెంచేటప్పుడు వాటికి వేసే యాంటీబయాటిక్స్, హార్మోన్ ఇంజెక్షన్ల ప్రభావం మన శరీరంపై పడుతుంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఊబకాయం పెరగడం, తక్కువ వయసులోనే శారీరక మార్పులు రావడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి చికెన్‌ను మితంగా తీసుకోవడం, వండేటప్పుడు తక్కువ మసాలాలు వాడటం మరియు నాటు కోడి వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే చికెన్ తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. చికెన్ ను ఎక్కువగా తినే వాళ్ళు మాత్రం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి