రాజకీయాల్లో కష్టం, ఆర్ధిక పరమైన అండతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే నాయకులు సక్సెస్ బాట పడతారు. రాజకీయాల్లో ప్రతి నాయకుడు కష్టపడుతూనే ఉంటారు. కానీ ఆర్ధికంగా అందరూ బలంగా ఉండకపోవచ్చు...అయితే ఆర్ధిక బలం ఉన్నవాళ్లకు రాజకీయాల్లో తిరుగుండదు. దాంతో పాటు అదృష్టం తోడైతే అలాంటి నాయకులకు తిరుగులేదు. ఇలా మూడు విధాలుగా కలిసొచ్చిన నాయకుడు అవంతి శ్రీనివాస్.

మొదట నుంచి అవంతి ఆర్ధికంగా బలమైన నేత...ఇక ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బాగానే కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనకు కాస్త అదృష్టం కూడా తొడయ్యి...2009 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అవంతికి అదృష్టం మామూలుగా పట్టలేదు. ప్రజారాజ్యం...కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఛాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ని వదిలి టీడీపీలో చేరి...2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచేశారు. అప్పుడు కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది...పైగా కేంద్రంలో పొత్తులో ఉన్న బీజేపీ కూడా అధికారంలోకి వచ్చింది...దీంతో అవంతికి అదృష్టం బాగా కలిసొచ్చింది.

ఇక 2019 ఎన్నికల ముందు మరొకసారి అవంతి అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. టీడీపీని వీడి వైసీపీలో చేరి..మరోసారి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ అసలైన అదృష్టం అవంతికి దక్కింది...విశాఖలో అనేకమంది ఉన్నా సరే మంత్రి పదవి అవంతికే దక్కింది. ఇక్కడ వరకు అవంతిని అదృష్టం ఎలా వరించిందో అర్ధం చేసుకోవచ్చు.

కానీ గత కొంతకాలం నుంచి అవంతికి అదృష్టం అడ్డం తిరిగినట్లు కనిపిస్తోంది. ఆయన ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీనికి తోడు మంత్రిగా అద్భుతమైన పనితీరు కనబర్చడం లేదనే విమర్శలు తెచ్చుకుంటున్నారు. అవంతి అంటే అందరికీ తెలుసు గానీ, ఆయన ఏ శాఖకు మంత్రిగా ఉంటున్నారో ఎవరికీ క్లారిటీ లేదు. పైగా శాఖా పరంగా అవంతి ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదు. ఇక రాష్ట్రానికి మంత్రో...లేక విశాఖ సిటీకి మంత్రో అర్ధం కాకుండా ఉంది.

అటు ఎమ్మెల్యేగా అవంతి...భీమిలిలో చేసిన గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదు..ఏదో ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ పథకాలు, కొన్ని అభివృద్ధి పనులు తప్ప. ఇప్పటికే భీమిలిలో అవంతిపై నెగిటివ్ పెరిగిందని టాక్. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడున్న డివిజన్లలో టీడీపీనే పైచేయి సాధించింది. అంటే అవంతి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిసి బరిలో దిగొచ్చని ప్రచారం జరుగుతుంది..అదే జరిగితే అవంతికి అదృష్టం కలిసిరావడం కూడా కష్టమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: