కోట శ్రీనివాసరావు. అందరూ ముద్దుగా కోట అని పిలుచుకుంటారు. సుమారు 650కి పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు నటనంటే నటించినట్టు కాదు జీవించినట్టు ఉండాలి అని నిరూపించి చూపించారు. ఎంతో మంది నటీనటులకు ఈయన ఆదర్శం. సినీ ఇండస్ట్రీలో క్రమ శిక్షణ కలిగిన వ్యక్తిగా కోట శ్రీనివాసరావుకు పేరుంది. ఎక్కడ లోటు పాటులున్నా ముక్కుసూటిగా చెప్పగలిగే తత్వం ఆయనది. అందుకే కోట అంటే అందరికీ ప్రత్యేక గౌరవం. సినీ ఇండస్ట్రీలో ఆయన సలహాలు సూచనల కోసం ఆయన దగ్గరకు వెళ్తుంటారు.

కోటా శ్రీనివాసరావు.. కృష్ణా జిల్లా కంకిపాడులో 1945వ సంవత్సరం.. జులై 10వ తేదీన జన్మించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. కోట శ్రీనివాసరావు తండ్రి పేరు కోట సీతారామాంజనేయులు. ఈయన పేరు మోసిన ప్రముఖ వైద్యుడు. చిన్ననాటి నుండే కోట శ్రీనివాసరావుకు నాటకాలంటే ప్రాణం. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టక ముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు.కోట శ్రీనివాసరావు 1968వ సంవత్సరంలో రుక్మినిని వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం ఫలితంగా ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకున్నారు. కొడుకు కోట ప్రసాద్ 2010జూన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
 

కోటా శ్రీనివాసరావు.. 20ఏళ్లుగా రంగస్థల నటనలో రాణించారు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తున్న సమయంలో..ఆయన దర్శక నిర్మాత క్రాంతి కుమార్ కంట పడ్డారు. ఇంకేముందీ అదే నాటకాన్ని సినిమాగా తీయలనుకున్నారు. అంతేకాదు ఆ నాటకంలో నటించిన వారందరినీ తన సినిమాలోకి తీసుకొని వారి ప్రాధాన్యత కల్పించారు. అలా కోట శ్రీనివాసరావు గారు చిత్రపరిశ్రమలోకి వచ్చారు.  కడుపుబ్బా నవ్వించే  కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అహ నా పెళ్లంట సినిమాలో హీరోయిన్ తండ్రిగా.. పిసినిగొట్టు పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించారు. ఈ డెవడ్రా బాబూ... నాకేంటి ..మరి నాకేంటి.. మరదేనమ్మా నా స్పెషల్.. అయ్య నరకాసుర.. అంటే నాన్నా అదీ లాంటి డైలాగులతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.


అంతేకాదు కోట శ్రీనివాసరావు రాజకీయాల్లో కూడా రాణించారు. విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. 2015 సంవత్సరం కోట శ్రీనివాసరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.  అంతేకాదు కోట శ్రీనివాసరావు ఐదు నంది పురస్కారాలను అందుకున్నారు.

నేడు ఆయన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మరోవైపు వయసు మీద పడటంతో ఆయన కొంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. ఎలాంటి పాత్రలనైనా అలవోకగా చేయగలిగే గొప్ప ప్రతిభ కలిగిన వ్యక్తి. ఒక్క తేలుగులోనే కాదు ఇతర భాషా చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన దిగ్గజ నటుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: