ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సినిమా ఇండ‌స్ట్రీ అనే విధంగా సాగిన చ‌ర్చ‌లోకి లేటుగా అయినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. నిర్మాత‌కు, ప్రేక్ష‌కుల‌కు లేనిది ప్ర‌భుత్వానికి ఏమిట‌ని, సినిమా టికెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఎక్క‌డిద‌ని త‌న‌దైన లాజిక్‌తో రంగంలోకి దిగారు వ‌ర్మ‌. ఈ త‌రుణంలోనే వ‌రుస‌గా ప‌లు ట్వీట్ చేస్తూ ఇండ‌స్ట్రీ దృష్టిని అంతా త‌న‌వైపు తిప్పుకున్నారు.

ముఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 35 ను ప్ర‌వేశ‌పెట్టి సినిమా టికెట్ల ధ‌ర‌లు నిర్ణ‌యించి ఆ ధ‌ర‌ల కంటే ఎక్కువ‌గా అమ్మ‌కూడ‌దు అని ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో ప‌లువురు నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు హై కోర్టును సైతం ఆశ్ర‌యించారు. విచార‌ణ చేప‌ట్టిన హై కోర్టు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన జీవోను ర‌ద్దు చేసింది.
హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్‌లో అప్పీల్ చేయ‌డంతో మ‌రొక సారి ఏపీ సినిమా టికెట్ల‌పై విచార‌ణ చేప‌ట్టింది. ఈ స‌మ‌యంలోనే వర్మ ఏపీ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశిస్తూ 10 ప్ర‌శ్న‌లు సంధించారు. వీలు అయితే సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్నినాని ని క‌లుస్తాను అని అందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరారు. మంత్రి పేర్నినాని ఇవాళ ఆర్జీవీకి భేటీ అయ్యేందుకు ఆహ్వానించారు. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌లకు స‌చివాల‌యంలో పేర్నినానితో ఆర్జీవీ భేటీ కానున్నారు. ఇవాళ ఉద‌యం 11.45 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌ఫోర్ట్‌కు ఆర్జీవీ చేరుకుంటారు.

రామ్‌గోపాల్ వ‌ర్మ ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్నీ నానితో భేటీలో ఏమి చ‌ర్చిస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొన్న‌ది. ముఖ్యంగా సినీ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు నేను కేవ‌లం స‌హాయం చేస్తాను అని, పెద్ద‌రికం చేయ‌ను పేర్కొన‌డం ఇటీవ‌ల హాట్‌టాపిక్‌. మ‌రొక‌వైపు చిరంజీవి ప్ర‌క‌టించిన త‌రువాత మోహ‌న్‌బాబు ఓ లేఖ రాయ‌డం ఇక అది సంచ‌ల‌నం అయింది. ఈ త‌రుణంలోనే వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఎంట్రీ ఇచ్చి అంద‌రికీ షాక్‌కు గురి చేసాడు. ఇవాళ జ‌రిగే ఈ భేటీతో కొన్ని రోజులుగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పడ‌నున్న‌దా..? వ‌ర్మ ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించ‌నున్నారు.  అందుకు నాని ఎలాంటి స‌మాధానాలు ఇస్తారో తెలియాలంటే కొద్దిసేపు వేచి చూడాలి మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: