కొంత కాలంగా సినిమా టికెట్ల ధరల వ్యవహారం ఎంత చర్చనీయాంశం అవుతోందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి కదా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిమితికి మించి రేట్లు పెంచేయడం సామాన్యులకు కష్టంగా వుంది.అసలే కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లకు రావడం తగ్గించేసిన ప్రేక్షకులు ఈ రేట్లు చూసి బాగా బెంబేలెత్తిపోయి మరింతగా వెండి తెరలకు చాలా దూరమయ్యారు.తెలుగులో అయితే పెద్ద సినిమాలకు మల్టీప్లెక్సుల్లో రేటు రూ.300-400 మధ్య పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పెద్ద సినిమాలకు ఈ రేట్లు బాగా చేటు చేశాయి. 'ఆర్ ఆర్ ఆర్',  'సర్కారు వారి పాట' సినిమాలకు బాగానే ప్లస్ అయ్యింది. కానీ 'ఆచార్య' రెండో రోజు నుంచే అడ్రస్ లేకుండా పోవడానికి.. 'వారియర్' లాంటి సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ రాకపోవడానికి టికెట్ల రేట్లు పరోక్ష కారణం అనడంలో సందేహం లేదు. రోజు రోజుకూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.గత నెలలో వచ్చిన సినిమాలన్నింటికీ చాలా వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 రేటు ఉండేలా చూశారు.


'లైగర్'కు రేట్లు కొంచెం ఎక్కువ ఉండడం, పైగా డిజాస్టర్ టాక్ రావడం దెబ్బ కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ సినిమా 'బ్రహ్మాస్త్ర'కు హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో రూ.325 రేటు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ చిత్రానికి ఆల్రెడీ దేశవ్యాప్తంగా బుకింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్‌లో ప్రధాన మల్టీప్లెక్సులు టికెట్ల అమ్మకాలు ఆరంభించాయి. వాటన్నింట్లో కూడా సినిమాకు రూ.325 రేటు ఫిక్స్ చేసి పెట్టేశారు.దీనికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా కలిపితే రేటు రూ.360 దాకా అవుతోంది. ఇది భారీ బడ్జెట్ మూవీ కావడం, పైగా త్రీడీలో రిలీజ్ చేస్తుండడంతో ఈ రేటు నిర్ణయించినట్లున్నారు. నిర్మాతల వైపు నుంచి చూస్తే ఇది కరెక్ట్ రేటు అనిపింవచ్చు. కానీ ప్రేక్షకుల యాంగిల్లో చూస్తే మాత్రం ఈ రేటు చాలా ఎక్కువే. హిందీతో పాటు తెలుగు వెర్షన్‌కు కూడా ఇదే రేట్ ఫిక్స్ చేయడంతో మన ప్రేక్షకులు ఇంతింత రేటు పెట్టి ఒక అనువాద చిత్రాన్ని చూస్తారా అన్నది సందేహం. ఐతే సినిమాకు డీసెంట్ బజ్ ఉండడంతో బుకింగ్స్ అయితే ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ సినిమాకు మంచి టాక్ రాకపోతే మాత్రం ఈ రేట్లు ఎందుకు పెంచామో టీం బాధ పడాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: