టాలీవుడ్ సీనియర్ హీరో రెబెల్‌స్టార్ గా తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న కృష్ణంరాజు గారు ఆదివారం ఉదయం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ విలన్‌గానూ అలరించారు. 1966లో 'చిలకా గోరింకా' చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేశారు. 'అవేకళ్లు' చిత్రంలో ప్రతినాయకుడిగానూ నిరూపించుకున్నారు. 1977,1984 సంవత్సరాల్లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో 'తాండ్ర పాపారాయుడు' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు.


'భక్త కన్నప్ప', 'బొబ్బిలి బ్రహ్మన్న' చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. విజయనగర సామ్రాజ్య క్షత్రియ రాజ వంశానికి చెందిన కృష్ణంరాజు దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగానూ సేవలందించారు. కృష్ణంరాజు గారికి భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారి కుమారుడే ప్రముఖ నటుడు ప్రభాస్‌. కృష్ణంరాజు ఆయన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. హీరోగా, రాజకీయ నాయకుడిగా, కేంద్రమంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ చేధించిన ఆయన ప్రభాస్ పెళ్లి చూడకుండానే తుదిశ్వాస విడిచారు. తనకు ప్రభాస్ పెళ్లి చేయడం కంటే పెద్ద కోరిక ఏమీ లేదని ప్రభాస్ పిల్లలతో నటించాలని ఉందని పలుసార్లు వివిధ వేదికలపై చెప్పుకొచ్చారు.


కృష్ణంరాజు గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'విశాల నేత్రాలు' అనే నవల చేయాలనుకున్నారు. ఈ నవలలో ప్రభాస్ తో చేయాలని కృష్ణం రాజు అనుకున్నారు. కానీ చివరి కోరిక తీరకుండానే అనారోగ్యంతో మృతి చెందారు. మొదటి నుంచి హీరో ప్రభాస్ అంటే కృష్ణంరాజుకు ఎంతో ప్రేమ ఉండేది. అందుకే తమ్ముడి కుమారుడు అయినా, స్వయంగా కృష్ణంరాజే ప్రభాస్‌ను ప్రేమగా పెంచుకున్నారు. వీరిద్దరి మధ్య బంధం విడదీయరానిదిగా కొనసాగింది. ఇప్పుడు ఆయన చనిపోవడం కేవలం ప్రభాస్ కి ఆయన కుటుంబానికే కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకా ఆయన అభిమానులకు తీరని లోటు.


మరింత సమాచారం తెలుసుకోండి: