పోయిన చోటే వెతుక్కోవాలి అంటారు గానీ.. సునీల్ ఎంత వెతికినా పోగొట్టుకున్న ఇమేజ్ ని సంపాదించుకోలేకపోతున్నాడు. హీరోయిజాన్ని విడిచిపెట్టి మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చినా పాత స్టార్డమ్ రావడం లేదు. దీంతో ప్రేక్షకులను భయపెట్టి అయినా సరే మళ్లీ బిజీ కావాలనుకుంటున్నాడు సునీల్.

సునీల్ మళ్లీ ఫామ్ లోకి రావాలని చాలా కష్టపడుతున్నాడు. సూపర్ హిట్ జర్నీ చేయాలని హీరోయిజానికి కూడా బ్రేక్ చెప్పి సపోర్టింగ్ రోల్స్ లోకి వచ్చాడు. అరవింద సమేత, అల వైకుంఠపురములో కమెడియన్ గా నటించాడు. అయితే ఈ సినిమాలు హిట్ అయినా.. సునీల్ క్యారెక్టర్ క్లిక్ కాలేదు. దీంతో సునీల్ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి.

కామెడీ ఒక్కదాన్నే నమ్ముకుంటే పని కావడం లేదనీ.. విలన్ గానూ ప్రయత్నం చేస్తున్నాడు సునీల్. యూట్యూబ్ స్టార్స్ సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటిస్తోన్న కలర్ ఫోటోలో విలన్ గా చేశాడు. ఈ సినిమాలో క్రూరత్వాన్ని చూపించి.. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు.

సునీల్ ఇంతకుముందు కూడా విలన్ గా నటించాడు. రీఎంట్రీలో చేసిన డిస్కోరాజాలో విలనిజం చూపించాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సునీల్ విలనిజం కూడా హైలెట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు కలర్ ఫోటోలో రౌడీయిజం చూపించబోతున్నాడు. మరి ఈ విలనిజంతో అయినా సునీల్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడా అనేది చూడాలి.

సునీల్ ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. ఆయన సినిమాలో ఉన్నాడంటే ఖచ్చితంగా కామెడీ పండేది. కడుపు ఉబ్బా నవ్వుకునేందుకు థియేటర్లకు క్యూ కట్టేవారు. అంతేకాదు ఆ సమయంలో ఆయనలా ఇమిటేట్ చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. అంత పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ కామెడీ రోల్స్ ను పక్కన పెట్టాడు.  కొన్ని రోజులు సినిమాలకు దూరమయ్యాడు. కండలు పెంచాడు. హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. శించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో.. ఏం చేయాలో తెలియక డైలమాలో ఉండిపోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: