ఒక సినిమా కోసం ఎంతాకైనా ఖర్చు పెట్టమనే హీరోలు ఉన్నారు. ఇక తమ మార్కెట్ విషయంలో వెనక్కి తగ్గని వారున్నారు. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకునే వారినీ చూస్తారు. కానీ తనతో సినిమాలు తీసే ప్రతీ నిర్మాత బాగుండాలని ఆలోచించేవారు కూడా కొందరు ఉంటారు.

అలాంటి వారిలో హీమాన్ గా అందాల  నటుడిగా పేరు గాంచిన శోభన్ బాబు పేరు ముందు చెప్పుకోవాలి. ఆయన నిర్మాతల హీరోగానే చివరి దాకా ఉన్నారు. ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలకు సలహా సూచనలు ఇస్తూ బడ్జెట్ హద్దులు దాటవద్దని సుతిమెత్తగా హెచ్చరించేవారుట. శోభన్ బాబు తో వరసగా హిట్లు తీసిన రాశీ మూవీస్ అధినేత నరసింహారావు అయితే శోభన్ బాబు తీరే వేరు అంటూ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

శోభన్ బాబు తో అప్పటికే బావమరదళ్ళు, మహరాజు లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన నరసింహారావు మరో ప్రయత్నంగా భార్యాభర్తలు మూవీ తీశారు. ఈ మూవీ షూటింగ్ అనుకున్నపుడు బడ్జెట్ వేరు, మధ్యలో అది కాస్తా పెరిగింది. దానికి కారణం ఆ సినిమాలో పాటలు అన్నీ కూడా అందాల కాశ్మీరంలో చిత్రీకరించాలని భావించడమే. ఆ మూవీకి డైరెక్టర్ కె మురళీమోహనరావు. ఆయన అప్పటికే బాలయ్యతో కధానాయకుడు, చిరంజీవితో సంఘర్షణ వంటి సూపర్ హిట్లు తీశారు. లావిష్ గా మూవీస్ తీయాలని తపన పడే డైరెక్టర్ గా పేరుంది.

ఆయన సాంగ్స్ విషయంలో నిర్మాత నరసింహారావుకు ఈ సంగతి చెబితే ఆయన ఓకే అనేశారుట. అయితే ఈ విషయం తెలుసుకున్న శోభన్ బాబు పాటల కోసం అంత దూరం వెళ్ళాలా, అంత డబ్బు ఖర్చు పెట్టాలా అని నిర్మాతకు మెత్తగా క్లాస్ తీసుకున్నారుట. అలా కనుక చేస్తే ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఏడెనిమిది లక్షలు ఖర్చు  ఎక్కువ అవుతుంది. దాంతో ఆయన వద్దు  అనే వారించారుట. అయినా నిర్మాత వినకుండా కాశ్మీర్ లోనే తీశారుట. మొత్తానికి ఆ మూవీ రిలీజ్ కావడం సూపర్ హిట్ కావడం జరిగాయి. ఏది ఏమైనా నిర్మాత శ్రేయస్సు కోసం వాదించే హీరోలు ఆ రోజుల్లో ఉండడం అంటే ఎంతటి అదృష్టమో అని రాశీ మూవీస్ అధినేత చెబుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: