ప్రభాస్  హీరోగా బాలీవుడ్  డైరెక్టర్  ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్ ' టీజర్ విడుదల అయ్యి రికార్డులు సృష్టిస్తున్నా కూడా మెజారిటీ ప్రేక్షకులకు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. సినిమా గురించి ఏదో ఊహించుకుంటే టీజర్లో ఇంకేదో కనిపించింది. టీజర్లో ఇదొక యానిమేషన్ మూవీలాగా కనిపించడమే చాలామందికి రుచించలేదు. ఇక ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, రావణుడి పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్ అప్పీయిరెన్స్ మీద తీవ్ర విమర్శలే వచ్చాయి.ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్ అయిన మూవీ ఇంకోటి లేదు అనే స్థాయిలో 'ఆదిపరుష్' నెగెటివిటీని ఎదుర్కొంటోంది ఇప్పటికీ ఈ ట్రోల్ కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ప్రభాస్ లైవ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ తర్వాత అయోధ్యలో ప్రభాస్ అండ్ టీం బస చేసిన ఒక హోటల్లో తీసిన వీడియో.


ఆ వీడియోలో ప్రభాస్ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఓం రౌత్ వైపు వేలు చూపిస్తూ.. చాలా కోపంగా నా రూమ్ కి రా అని ప్రభాస్ అనడం కనిపించింది. బయట చాలా సరదాగా కనిపించే ప్రభాస్.. ఈ వీడియోలో చాలా కోపంగ ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతను క్యాజువల్‌గానే ఓం రౌత్‌ను తన రూంకి రమ్మని పిలిచి ఉండొచ్చు. కానీ నెటిజన్లు మాత్రం దీనికి వేరే భాష్యం చెబుతున్నారు.'ఆదిపురుష్' టీజర్, దానికి వచ్చిన రెస్సాన్స్ చూసి ప్రభాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని.. ఈ క్రమంలోనే ఓం రౌత్‌ను రఫ్ఫాడించడానికి తన రూంకి పిలిచాడని అంటున్నారు. ‘నువ్వు నాకు నచ్చావ్’లో కిళ్ళీ గురించి మాట్లాడాలి అంటూ సునీల్‌ను వెంకీ పట్టుకునే వీడియో, అలాగే 'కిక్'లో ఆలీని లోపలికి తీసుకెళ్లి రవితేజ బాదే వీడియో.. ఇంకా 'బృందావనం'లో బ్రహ్మానందానికి ఎన్టీఆర్ కోటింగ్ ఇచ్చే వీడియో.. ఇలా రకరకాల వీడియోలు దానికి జోడించి మీమ్స్ చేస్తూ డైరెక్టర్ ఓం రౌత్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: