
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు గాలి మారినట్లే కనిపిస్తోంది. టికెట్ల ధరలు పెంచుకోవడం, బెనిఫిట్ షోలు వేయడం మరింత సులభమయ్యాయి. గతంలో తెలంగాణలో సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ నియంత్రణ కఠినంగా ఉండగా, తాజా పాలకులు కొన్ని సినిమాలకు సడలింపులు ఇవ్వడం ప్రారంభించారు. అయితే గత ఏడాది ‘పుష్ప-2’ విడుదల సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఒక దశలో బెనిఫిట్ షోలు, హై టికెట్ రేట్లకు బ్రేక్ వేసింది. కానీ ఆ పరిమితి ఇప్పుడు తగ్గినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే బెనిఫిట్ షోలు, అధిక టికెట్ ధరలకు ఎలాంటి అడ్డంకులు లేవు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక చిత్రం హరిహర వీరమల్లుకి ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా ప్రత్యేక అనుమతులు లభించాయి. చారిత్రక నేపథ్యం, దేశభక్తి అంశాలను దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో నార్మల్ టికెట్ ధరలతో పోలిస్తే, కొన్నిచోట్ల టికెట్లు రెండున్నర నుంచి మూడింతల వరకు ఎక్కువగా వేశారు.
అయితే ఈ అధిక ధరల టికెట్ల వల్ల నిర్మాతలు, పంపిణీదారులు లాభపడితే సరి. కానీ, వాస్తవం చూస్తే... అదే అతి ఆశలే వారిని నష్టాల బాట పట్టించాయి. ప్రీమియర్ షోల నుంచి వచ్చిన ఆదాయాన్ని చూసి అందరికి ఉత్సాహం వచ్చేసింది. టికెట్ల ధరల కారణంగా ఒక్కరాత్రిలోనే భారీ కలెక్షన్లు వచ్చాయి. కానీ అదే ప్రీమియర్ షోలు సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్‌ను మరింత వేగంగా పెంచాయి. ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో జరిగింది మళ్లీ వీరమల్లు సినిమా విషయంలోనూ మరోసారి రిపీట్ అయ్యింది. అసలే నెగెటివ్ టాక్ ఉంది, పైగా టికెట్ ధరలు భారం. అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం అసాధ్యం. మల్టీప్లెక్స్‌లో టికెట్ల ధర రూ.400–500 మధ్య ఉండగా, సింగిల్ స్క్రీన్లలో కూడా రూ.300 దాటి పోయాయి. పవన్ అభిమానులకే ఇది భారంగా అనిపించగా, సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లే ప్రసక్తే లేకుండా పోయింది.
ఫలితంగా, మొదటి రోజు తరువాత థియేటర్లలో ఆక్యుపెన్సీ భారీగా పడిపోయింది. ఈ పరిణామం సినీ పరిశ్రమకు ఓ బుద్ధి చెప్పేలా ఉంది. ప్రేక్షకుడి మనస్సులను కథతో గెలవకపోతే ఏం జరుగుతుంది.. ఎంత టిక్కెట్ హైక్ ఉన్నా ఉపయోగం లేదు అనేందుకు ఇదే నిదర్శనం.