తెలుగు రాజకీయాల్లో చిరస్మరణీయమైన రెండు పేర్లు – నారా చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వీరిద్దరి మధ్య రాజకీయ పోటీ ఎంత తీవ్రంగా జరిగిందో అందరికీ తెలుసు. కానీ వారి వ్యక్తిగత స్నేహం గురించిన సంగతులు అంతగా బయటికి రావు. ఈ స్నేహాన్ని, రాజకీయ జీవితాన్ని కలిపి ఓ వెబ్ సిరీస్ రూపంలో తెరపైకి తీసుకొస్తూ దర్శకుడు దేవ కట్టా 'మయసభ' పేరుతో ఒక బాంబును వదిలేశాడు. సోని లివ్ వేదికగా ఆగస్ట్ 7న స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా నిన్న‌ సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ చూస్తేనే అందరికీ ఇది ఎవరి జీవితాల ఆధారంగా తీసారో స్పష్టంగా అర్థమవుతోంది. ఆది పినిశెట్టి చంద్రబాబును పోలిన పాత్రలో, చైతన్యరావు వైఎస్ పాత్రను తలపించేలా కనిపించారు. ఎన్టీఆర్ ని పోలిన పాత్రలో సాయికుమార్ మెరవడం చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ!


కథ కంటే కూడా దాని వెనుక ఉన్న ధైర్యమే హైలైట్.. సినిమాల్లో వివాదాలు వస్తే సెన్సార్ బోర్డు చూసుకుంటుంది. కానీ వెబ్ సిరీస్ కి అలాంటిదేమీ లేదు. దీన్ని బాగా అర్థం చేసుకున్న దేవ కట్టా, రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కథను బలంగా చెప్పేందుకు ప్రయత్నించారు. కేవలం పేర్లు మార్చేశారంతే – కథ, సందర్భాలు చూసే సరికి ఎవరిగా ఎవరు నటించారో చిన్నపిల్లాడికైనా అర్థమవుతుంది. ఇది కల్పితమా? లేక నిజానిజాల మేళవింపా? .. ఇప్పటికీ ప్రజల్లోకి పూర్తిగా తెలియని ఈ ఇద్దరి మధ్య స్నేహం నిజంగా ఉందా? అసలు ఆ స్నేహం రాజకీయాల్లోకి ఎలా మారింది? ఆ మార్పులో ఎవరి బాధ్యత ఎంత? అనే ప్రశ్నలకు ఈ సిరీస్ జవాబిస్తుందా? లేక కల్పనలతో కలియదిరిగేలా చేస్తుందా? అనే ఆసక్తికరమైన క్వశ్చన్స్ ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇంతవరకూ 'ప్రస్థానం', 'ఆటో నగర్ సూర్య', 'రిపబ్లిక్' వంటి సినిమాలతో రాజకీయాల్లోని నిజాలను చక్కగా చూపించిన దేవ కట్టా, ఈసారి మరింత బోల్డ్ గా వ్యవహరించారు. ఇదే ట్రెండ్ కొనసాగితే...రాజీకియాలో కూడ మయసభ చర్చల్లో నిలవబోతుంది.


ఈ సిరీస్ కి స్పందన ఎలా ఉంటుందో? రాజకీయంగా ఎవరు ఎలా స్పందిస్తారో? .. టీడీపీ, వైసీపీ వర్గాలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. స్నేహంగా చూపించినా, ప్రతిసారీ చూపించేది వ్యతిరేకపక్ష నాయకుడేనంటే.. ఎక్కడో గిలిగింతలు తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్ చూసినవాళ్లు తెగ చర్చించుకుంటున్నారు – "ఈ సిరీస్ కొట్లాటలు పెంచుతుందా లేక కొత్తగా ఆలోచించేస్తుందా?" అని. తెలుగు వెబ్ కంటెంట్ లో బోల్డుగా, పొలిటికల్ గా బ్లంట్‌గా ఏదైనా వస్తే.. అది మయసభే అయ్యే అవకాశముంది. గందరగోళాల మధ్య దేవ కట్టా చెప్పబోయే ఈ స్నేహ కథ... ఉప్పు నిప్పుల మధ్య ఎదిగిన ఒక అవ్యక్తమైన రిలేషన్‌షిప్ ను ప్రేక్షకులకు చేరువ చేస్తుందో లేదో.. చూడాల్సిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: