
బాలీవుడ్ లో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో నిలుస్తూ వార్తల్లో నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్. తన మాటలతో తూటాలు పేల్చే కారణంగా ఆమెను చాలామంది ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పడం కంగనాకు కొత్తేమీ కాదు. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. అదే పెళ్లి. గత కొన్ని నెలలుగా కంగనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని అనేక రకాల పుకార్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూమర్లు వస్తూనే ఉండటంతో అభిమానుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఈ వార్తలపై కంగనా స్వయంగా స్పందించింది. “నా పెళ్లి గురించి ఇప్పటికే వందల వార్తలు రాశారు. కానీ వాటిలో ఒక్కటికి కూడా వాస్తవం లేదు” అని చెప్పింది.
తన పెళ్లిపై తాను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిజానికి పెళ్లి వ్యవస్థపైనా పెద్దగా నమ్మకం లేదని కంగనా తెలిపింది. “నాకు పెళ్లి, కుటుంబం అంటే పెద్దగా ఆకర్షణ లేదు. అందుకే వాటికి దూరంగా ఉంటున్నాను. పెళ్లి కావట్లేదని బాధ కూడా లేదు. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా సినిమాలు, రాజకీయాలపై ఉంది. ఈ రంగాల్లోనే నేను సంతృప్తిగా ఉన్నాను. బహుశా పెళ్లి, పిల్లలు అనే విషయాలు నా లైఫ్ స్టైల్‌కి సూట్ కావు” అంటూ కామెంట్స్ చేసింది. కంగనా చెప్పిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. చాలామంది ఆమె నిర్మొహమాట ధోరణిని ప్రశంసిస్తే, ఇంకొందరు మాత్రం ఆమె ఆలోచనలను విమర్శిస్తున్నారు. కానీ కంగనాకు అలాంటి విమర్శలంటే పెద్దగా భయం లేదు. తన వ్యక్తిగత జీవితం, తన నిర్ణయాలపై తానెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే నమ్మకంతోనే ఆమె బహిరంగ వేదికలపై ఈ విషయాలు చెప్పడం గమనార్హం.