
‘వాల్తేరు వీరయ్య’ మాత్రమే మరోసారి చిరంజీవికి గౌరవప్రదమైన హిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులు ఆయన కెరీర్ గ్రాఫ్‌ను కాస్త వెనక్కి నెట్టాయి. ఇక బాలయ్య విషయానికి వస్తే.. ‘అఖండ’ తర్వాత ఆయన కెరీర్ నిజంగా కొత్త ఊపును అందుకుంది. ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, తాజా ‘డాకూ మహారాజ్’ వరకు వరుస విజయాలతో ఆయన మళ్లీ మాస్ ఆడియెన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, ‘అన్‌స్టాపబుల్’ వంటి టాక్ షో ద్వారా కొత్త తరానికి కూడా మరింత దగ్గరయ్యారు. పబ్బుల్లో కూడా యువత ‘జై బాలయ్య’ అంటూ పాటలు పాడటం బాలయ్య క్రేజ్ ఎంత పెరిగిందో చూపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి బాలయ్య కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోయే ‘అఖండ 2’ మీద ఉంది.
ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే, బాలయ్య స్థానం మిగతా అగ్ర హీరోలకు అందని ద్రాక్షగా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు “చిరంజీవి – బాలకృష్ణ” అని అన్నవారు, ఇప్పుడు “బాలకృష్ణ – చిరంజీవి” అని అంటున్నారు అంటే మారిన పరిస్థితి అర్థమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానానికి శాశ్వత గుర్తింపు లేదు. ఒక సినిమా విజయం, ఒక సినిమా కలెక్షన్లే ఆ స్థానం ఎవరికి వస్తుందో నిర్ణయిస్తాయి. కానీ వరుస విజయాలు, పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా, ప్రస్తుతం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా చాలా ముందంజలో ఉన్న హీరో బాలయ్య అని ధైర్యంగా చెప్పొచ్చు. ‘అఖండ 2’ విజయం బాలయ్యను నేటి టాప్ హీరోలలో అప్రతిహతంగా నిలబెట్టే అవకాశం ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.