వరుసగా మాస్ మసాలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, కొంతమంది విమర్శకుల దృష్టిలో రొటీన్ హీరో అయిపోయిన యంగ్‌ హీరో రామ్ పోతినేని ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నాడు. ఈసారి ఆయన పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో రానున్నాడు. ఆ సినిమా పేరు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. టైటిల్‌నే చూస్తే ఓ మాస్ ఫీలింగ్ ఉన్నట్టే అనిపించినా, కంటెంట్ మాత్రం సరికొత్తగా, ఎమోషన్, ఫ్యాన్ మేనియా మిక్స్‌డ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.ఈ సినిమా మామూలు యాక్షన్ లేదా లవ్ ఎంటర్‌టైనర్ కాదు. ఒక స్టార్ హీరోకు గట్టి అభిమాని అయిన యువకుడి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. అందుకే దీనికి “బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేశారు. ఈ సినిమాలో అసలు స్టార్ హీరో పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు స్పెషల్ ఎట్రాక్ష‌న్‌గా నిలుస్తుందనేది ట్రేడ్ టాక్. కానీ సినిమా మొత్తం రామ్ పోతినేని క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ అభిమాని తన హీరో కోసం ఎంతదూరం వెళ్తాడనే అంశం కథలో కేంద్రీకృతమవుతుంది.


‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పి. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈయన క్రియేటివ్ టచ్, రామ్ ఎనర్జీ కలిస్తే కొత్తగా ఏదో చూపించగలమనే నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకమైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది  కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో తెరకెక్కించారట. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. సాధారణంగా తెలుగు సినిమాలకు యుఎస్‌లో ఒక రోజు ముందు ప్రిమియర్ షోలు జరుగుతాయి. అయితే ఈసారి టీమ్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇండియన్ టైమ్ ప్రకారం బుధవారం అర్ధరాత్రి నుంచే, అంటే రిలీజ్‌కు రెండు రోజుల ముందే యుఎస్ ప్రీమియర్స్ మొదలవుతాయి. దీనివల్ల సినిమా టాక్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌కు ముందే బయటకు వచ్చే అవకాశం ఉంది.


ఇది రిస్క్‌ లేకపోలేదు. గతంలో ‘వీర భోగ వసంత రాయలు’ అనే సినిమాకు మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేసి బ్యాడ్ టాక్ రావడంతో దారుణంగా నష్టపోయారు. ఆ అనుభవం టీంకు తెలిసే ఉంటుంది. అయినా సినిమా మీద నమ్మకంతో రామ్ అండ్ టీమ్ ధైర్యం చేస్తోంది. హీరో రామ్ స్వయంగా యుఎస్ ప్రీమియర్స్‌కు హాజరవుతూ, అక్కడ మూడు నుండి నాలుగు రోజుల పాటు ప్రమోషన్స్ చేయబోతున్నాడు. ఇది సినిమాపై రామ్‌లో ఉన్న‌ నమ్మకం, కాన్ఫిడెన్స్‌కు నిదర్శనం. ఇప్పుడు అందరి చూపు ఈ ప్రయోగం ఫలిస్తుందా, రామ్ కొత్త దారికి ఇది బిగ్ బ్రేక్ అవుతుందా అన్నదానిపై నిలిచింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నిజంగా ఫ్యాన్స్‌కు మరియు సాధారణ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందా అన్నది నవంబర్ 28న తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: