భారత సినీ పరిశ్రమలో ప్ర‌మోష‌న్స్ అంటే కళ, ఆ కళలో దిట్ట ఎవ‌రంటే—ఎస్.ఎస్. రాజమౌళి పేరు ముందువరుసలో నిలుస్తుంది. త‌న సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో, కొత్త మార్కెట్లను తెరుచుకోవడంలో, ప్రేక్షకుల మైండ్‌సెట్‌ను ముందే షేప్ చేయడంలో రాజ‌మౌళికి సాటిలేరు. పైసా లేకుండానే కోట్ల విలువైన ప్రచారం తెచ్చుకునే సామర్ధ్యం ఆయనదే. ‘బాహుబలి’తో తెలుగు సినిమాని పాన్ ఇండియా కాక ప్రపంచ సినిమా మ్యాప్‌పై పెట్టిన వ్యక్తి రాజమౌళే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా నిలబడగలిగింది అంటే—కేవలం ఆయన దర్శకత్వ నైపుణ్యం మాత్రమే కాదు, ఆయన వేసిన పబ్లిసిటీ ఎత్తుగడలే కూడా ప్రధాన కారణం.


రాజమౌళి యొక్క స్ట్రాటెజీలు అసలు అంతు పట్టేవి కాదు. ఆయన ఆలోచనలు, ప్లాన్లు—ఎప్పుడూ ఊహకు అందని విధంగానే ఉంటాయి. ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌లోనూ అదే కనిపిస్తోంది. ముఖ్యంగా ‘వారణాసి ఈవెంట్’ విషయంలో ఆయన వేసిన పబ్లిసిటీ ప్లానింగ్‌ పూర్తిగా భిన్నంగా కనిపించింది.



హాలీవుడ్ దృష్టిలో పడాలంటే… ఇప్పుడే మొదలు!

హాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తే, సినిమా రిలీజ్ సమయంలో చేసే ప్రచారం సరిపోదు. ప్రారంభం నుంచే ఆ సందేశం బయటికి వెళ్లాలి. అందుకే ఈవెంట్‌కి హాలీవుడ్ జర్నలిస్టులను ఆహ్వానించడం రాజమౌళి చేసిన అత్యంత తెలివైన పని. వారికి “తెలుగులో ఓ భారీ ప్రయాణం మొదలైంది… ఈ సినిమా హాలీవుడ్ వరకు వెళ్లబోతోందనే సంకేతం ఇది” అనే సందేశం చేరడం ఆయన అసలు కోరిక. వారణాసి ఈవెంట్‌లోని జనం, హడావిడి, ఎమోషన్, స్టార్ క్రేజ్—అన్నీ కలిపి చూసినప్పుడు ఆ హాలీవుడ్ మీడియాకు ఒక్క సందేశం స్పష్టమైంది: “ఈ క్రాఫ్ట్ ఎంత పెద్దది… ఈ దర్శకుడి మార్కెట్ ఎంత విస్తృతమైందో”..ఇదే రాజమౌళి యొక్క మాస్ట‌ర్‌స్ట్రోక్..!



ప్రేక్షకుల మనసును ముందే ట్యూన్ చేసే రాజమౌళి"

మహేష్ బాబు సినిమా కథేమిటి? ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? అని సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. అలాంటి సమయంలో రాజమౌళి ఒక స్పష్టతను ప్రేక్షకుల మైండ్‌లో ముందే సెట్ చేశాడు— “ఈ సినిమా ఏ జానర్, ఏ స్కేల్, ఏ ఎమోషన్ మీద నడుస్తుందో నేను చెబుతాను… మీరు దాని ఆధారంగా ఎదురుచూడండి.” ఇలా ఆయన ప్రేక్షకుల అంచనాలను ముందే సరిగ్గా ట్యూన్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఇష్టం లేనిది ఒక్కటే— ఊహించకూడని అంచనాలు పెట్టుకొని థియేటర్లకు వచ్చి, తర్వాత నిరాశపడే ప్రేక్షకుడు. ఈ ట్యూనింగ్ కూడా ఆయన యొక్క మార్కెటింగ్ ప్లాన్‌లో కీలక భాగమే. అంతేకాదు, ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన హైప్‌ను ఆయన డిజిటల్ రైట్స్ డీల్‌తో కూడా ఉపయోగించుకున్నాడు. ప్ర‌సార హక్కులను జియో, హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు అమ్మి ముందుగానే మంచి రెవెన్యూ రాబట్టడం కూడా ఆయన స్ట్రాటజీలోని మరో తెలివైన అడుగు.

మరింత సమాచారం తెలుసుకోండి: