నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న అఖండ-2 తాండవం పై అభిమానుల్లో అసాధారణ స్థాయిలో హైప్ నెలకొంది. అఖండ ఫ్రాంచైజ్‌కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సీక్వెల్ ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. స్క్రీన్‌పై అఘోర శివతత్త్వాన్ని చూపించిన తొలి భాగం ఓ రేంజ్‌లో జైత్రయాత్ర సాగించినందున, రెండో భాగంపై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అఖండ 2 - తాండవం డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని నిర్మాతలు, పంపిణీదారులు రెడీ అయ్యారు. అయితే ఏరోస్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌తో ఈ సినిమా మేకర్స్‌కు ఉన్న పాత బాకీలు, ఆర్థిక అంశాల నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడక తప్పని పరిస్థితి.
దీంతో కొత్త విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నా, అధికారికంగా మాత్రం ఇంకా డేట్ ఖరారు కాలేదు. అయితే డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 తేదీలలో ఏదో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓవర్సీస్ పంపిణీదారులు 12వ తేదీకే విడుదల చేయాలని గట్టిగా ఒత్తిడి చేస్తుండగా, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం క్రిస్మస్ హాలీడే సీజన్‌లో ... అంటే డిసెంబర్ 25 న రిలీజ్ అయితేనే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. ఈ అభిప్రాయ భేదాలే విడుదల తేదీ నిర్ణయాన్ని మరింత క్లిష్టం చేశాయి. ఆదివారం జరిగిన ముఖ్య సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలతో పాటు బాలయ్య కూడా పాల్గొనడం సినిమాకు కీలక మలుపు ఇచ్చిందని చెప్పాలి.
ఈ క్లిష్ట సమయానికి బాలకృష్ణ నిర్మాణ బృందానికి అండగా నిలబడ్డారు. అఖండ 2 కోసం ఆయన పారితోషికం 45 కోట్లుగా ప్రచారం జరుగుతుండగా, అందులో 10 కోట్లను తిరిగి ఇచ్చినట్లు, అలాగే ఇంకా రావాల్సిన మరిన్ని 7 కోట్లను పూర్తిగా వదిలేసినట్లు పరిశ్రమలో సమాచారం. మొత్తంగా 17 కోట్లు నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గించేందుకు బాలయ్య ముందుకొచ్చినట్లే. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానులు “అది బాలయ్య అంటే!” అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా ఒకవైపు ఏరోస్ సంస్థ తమకు రావాల్సిన 28 కోట్లు కట్టాల్సిందే అని ఎన్ఓసీ సిద్ధం చేసి విదేశాలకు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు డిసెంబర్ 5 విడుదల కోసం అప్పులు పెట్టి థియేటర్లు బుక్ చేసిన ఎగ్జిబిటర్స్ ఆర్థిక ఒత్తిడిలో పడుతున్నారు. సినిమా త్వరగా రిలీజ్ కాకపోతే వారికి భారీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి