నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘ అఖండ 2 ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ చిత్రం విజయపథంలో దూసుకుపోతుండగానే, బాలయ్య తన తదుపరి చిత్రం NBK111 పై అప్పుడే అంచనాలను ఆకాశానికి చేర్చేశారు. ‘ వీరసింహారెడ్డి ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాపై ప్రముఖ స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటల ప్రకారం NBK111 కేవలం ఒక మాస్ మసాలా సినిమా మాత్రమే కాదు.
ఈ సినిమా రిలీజ్ అయ్యాక సగటు ప్రేక్షకుడు సైతం బాలయ్య నటన, సినిమాను చూసి షాక్ అవ్వడం ఖాయమని, ఇందులో బాలయ్య సరికొత్త కోణాన్ని చూస్తారని ఆయన అన్నారు. నందమూరి అభిమానులే కాకుండా, సామాన్య ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసి గర్వపడేలా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇలాంటి సబ్జెక్టులు ఇండస్ట్రీలో రావడం చాలా అరుదని, గోపీచంద్ మలినేని ఈ కథను అద్భుతంగా డిజైన్ చేశారని సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ మలినేని సినిమాల్లో హీరో ఎలివేషన్లు ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలిసిందే. ఇప్పుడు దానికి సాయి మాధవ్ బుర్రా పవర్‌ఫుల్ మాటలు తోడవ్వడంతో బాలయ్య విధ్వంసం ఓ రేంజ్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది.
చారిత్రక మరియు పౌరాణిక చిత్రాలకు ప్రాణం పోసే సాయి మాధవ్ బుర్రా, బాలయ్య గత చిత్రాలు 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఎన్టీఆర్ బయోపిక్' వంటి సినిమాలకు అద్భుతమైన సంభాషణలు అందించారు. ఇప్పుడు NBK111 కోసం ఆయన ఎంచుకున్న 'లెవెల్ వేరు' అనే మాట సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి