తమిళ దళపతి విజయ్ తన రాజకీయ ప్రవేశం నేపథ్యంలో సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో ‘ జన నాయగన్ ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమా బాలకృష్ణ హిట్ చిత్రం ‘ భగవంత్ కేసరి ’ కి రీమేక్ అనే వార్తలు రావడం. బాలయ్య బాబు నటించిన ‘ భగవంత్ కేసరి ’ లోని తండ్రి - కూతురు సెంటిమెంట్ మరియు యాక్షన్ అంశాలు విజయ్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతాయని భావించి ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాను తెలుగులో ‘ జన నాయకుడు ’ పేరుతో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకోవడానికి మొదట ఆసక్తి చూపారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ డీల్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ సినిమా అయినా ఇది ఇప్పటికే తెలుగులో వచ్చిన సినిమాకు రీమేక్ కావడం వల్ల ఆశించిన స్థాయిలో 'బజ్' రాకపోవచ్చని ఆయన భావించినట్లు ఫిలిం నగర్ టాక్. హెచ్. వినోద్ గతంలో ‘శతురంగ వేట్టై’, ‘వాలిమై’ వంటి సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ ఆఖరి సినిమా లో విజయ్‌ను అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారు.
ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మమితా బైజు పాత్ర ‘భగవంత్ కేసరి’ లోని శ్రీలీల పాత్రకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. విజయ్ - అనిరుధ్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్ అనేది అభిమానుల నమ్మకం. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
సంక్రాంతి బరిలో ‘జన నాయకుడు’ .. ?
ఈ చిత్రాన్ని పొంగల్ 2026 కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తెలుగులో ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తారు ? నాగవంశీ తప్పుకోవడంతో మరేదైనా పెద్ద బ్యానర్ ముందుకు వస్తుందా? లేదా డబ్బింగ్ వెర్షన్ నేరుగా విడుదలవుతుందా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. విజయ్ ఆఖరి సినిమా కావడంతో, అది రీమేక్ అయినా సరే ఒకసారి థియేటర్లలో చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి