ఈ వారం విడుదలైన సినిమాలలో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించిన సినిమా దండోరా. ఇప్పటికే విడుదలైన దండోరా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కుల వివక్ష, పరువు హత్య లాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సంవత్సరంలో  మెదక్ జిల్లాలోని తుళ్లూరు అనే గ్రామంలో అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు మరణిస్తే వాళ్ళను ఊరి చివరకు తీసుకొని వెళ్లి దహనం చేస్తుంటారు.  అదే గ్రామానికి చెందిన శివాజీ(శివాజీ) అగ్ర కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ శ్మశానంలో శివాజీ శవాన్ని తగలబెట్టవద్దని కుల పెద్దలు తీర్మానిస్తారు. శివాజీని కులం నుంచి బహిష్కరించడానికి కారణాలేంటి?  గతంలో శివాజీ ఏం చేశాడు? శివాజీకి అతని కొడుకు  విష్ణు(నందు) మధ్య ఉన్న సమస్య ఏమిటి? వేశ్య శ్రీలత (బిందు మాధవి)తో విష్ణుకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

కుల వివక్ష బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువే కాగా ఇలాంటి రిస్కీ కాన్సెప్ట్ ను ఎంచుకోవడానికి కూడా చాలామంది దర్శకులు భయపడతారు. దండోరా సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. 2004 నుంచి 2019 మధ్య నడిచే ఈ కథలో హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో పాటు సమాజంలోని వాస్తవ పరిస్థితులను తెలియజేసే సన్నివేశాలను సైతం ప్రధానంగా ప్రస్తావించారు.

అణచివేయబడిన కులానికి చెందిన వృద్ధురాలి మృతితో సినిమా మొదలు కాగా మనిషి చనిపోయిన సమయంలో సైతం కులం  వల్ల ఒక గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. రవి సుజాతల లవ్ స్టోరీ ఆకట్టుకునేలా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.

హత్యకు కారణమైన వ్యక్తి, అతని కుటుంబం ఎలాంటి మానసిక వేదనకు గురయ్యారనే అంశాలను ప్రధానంగా ప్రస్తావించగా ఇప్పటివరకు   ఏ సినిమాలో టచ్ చేయని ఈ పాయింట్ సినిమాకు హైలెట్ అయింది. ఆసక్తికర మలుపుతో ముగించిన క్లైమాక్స్ థియేటర్ల నుంచి బయటకు  వచ్చిన ప్రేక్షకులను కొన్ని రోజుల పాటు వెంటాడేలా ఉంది.

స్టోరీ లైన్ మరీ కొత్తది కాకపోయినా కథనం ఆసక్తికరంగా ఉండటం ఈ సినిమాకు హైలెట్ అయింది.  అయితే  సినిమాలో దర్శకుడు కొన్ని లాజిక్స్  మిస్ అయ్యారు.  సర్పంచ్ పాత్రకు సంబంధించి కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి.   డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

ఈ సినిమాకు శివాజీ పాత్ర హైలెట్ అయింది. నవదీప్ పాత్రను ఆసక్తికరంగా మలచలేదు. శ్రీనందు, బిందు మాధవి తమ నటనతో  మెప్పించారు.  సుజాత పాత్రలో నటించిన మనిక ఆకట్టుకుంది.

టెక్నీకల్  అంశాల విషయానికి వస్తే మ్యూజిక్, బీజీఎం  సినిమాకు ప్లస్ అయ్యాయి.  డైరెక్టర్  మురళీకాంత్ తను  ఎంచుకున్న అంశాన్ని పర్ఫెక్ట్ గా తెరపై చూపించే విషయంలో సక్సెస్ అయ్యారు.  కుల వివక్షకు కమర్షియల్ టచ్ ఇచ్చిన ఈ సినిమా  బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 3.0/5.0  

మరింత సమాచారం తెలుసుకోండి: