హాలీవుడ్ లెజెండరీ నటుడు లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio) సినిమా భవిష్యత్తు మరియు థియేటర్ల మనుగడపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ (OTT) యుగంలో థియేట్రికల్ అనుభవం మరుగున పడిపోతుందా? అనే అంశంపై ఆయన వ్యక్తం చేసిన ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


డికాప్రియో 'ది టైమ్స్' (The Times) కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలో జరుగుతున్న మార్పుల గురించి మాట్లాడారు. ఒకప్పుడు డాక్యుమెంటరీలు థియేటర్లలో కనిపించేవి, అవి ఇప్పుడు మాయమయ్యాయి. ఇప్పుడు డ్రామా సినిమాలకు కూడా థియేటర్లలో తక్కువ సమయం ఇస్తున్నారని, జనం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వేచి చూస్తున్నారని ఆయన అన్నారు.భవిష్యత్తులో సినిమా థియేటర్లు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన 'జాజ్ బార్స్' లా మారిపోతాయేమోనని ఆయన భయం వ్యక్తం చేశారు. అంటే, సినిమాలు చూసే అలవాటు అందరికీ కాకుండా కేవలం కొద్దిమందికి మాత్రమే ఉండే ఒక "అరుదైన హాబీ"గా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు.



సినిమా ప్రపంచం మెరుపు వేగంతో మారుతోందని, మనం ఒక భారీ పరివర్తన  దశలో ఉన్నామని ఆయన అభిప్రాయపడ్డారు.థియేటర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ, ఆయన ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. అద్భుతమైన ప్రతిభ ఉన్న దర్శకులు (Visionary Filmmakers)వినూత్నమైన కథలతో వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, అలాంటి గొప్ప చిత్రాలు థియేటర్లలోనే చూడాలనే తపన జనాలో ఉండాలని ఆయన కోరుకున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఒక సాధనంగా ఉపయోగపడవచ్చు కానీ, నిజమైన కళ అనేది మనిషి మేధస్సు నుండి రావాలని ఆయన కుండబద్దలు కొట్టారు. మానవత్వం లేని కళ ఎప్పటికీ నిలబడదని ఆయన పేర్కొన్నారు.



డికాప్రియో వ్యాఖ్యలు కేవలం హాలీవుడ్‌కే కాకుండా మన భారతీయ సినిమాకు కూడా వర్తిస్తాయి. భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలకు లభిస్తున్న ఆదరణ, ఎమోషనల్ డ్రామాలకు థియేటర్లలో దక్కకపోవడం ఇప్పుడు ఒక వాస్తవంగా మారింది. అయినప్పటికీ, వెండితెరపై సినిమా చూసే అనుభూతిని ఏ ఓటీటీ భర్తీ చేయలేదని ఆయన మాటల సారాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: