మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ కాంబినేషన్ సినిమాలో వెంకటేష్ కూడా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. 2026 సంవత్సరంలో అత్యంత భారీ అంచనాలతో 120 కోట్ల రూపాయల భారీ థియేట్రికల్ బిజినెస్ టార్గెట్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. భోళా శంకర్ తర్వాత చిరంజీవి నటించిన విశ్వంభర రిలీజ్ వేర్వేరు కారణాల వల్ల ఆలస్యం కాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిన్న రాత్రి ప్రీమియర్లతో థియేటర్లలో విడుదలైంది.
కథ :
నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేసే శంకర వరప్రసాద్ (చిరంజీవి) కేంద్ర హోమ్ మంత్రిగా పని చేస్తున్న నితీష్ శర్మ (శరత్ సక్సేనా) బాధ్యతలు చూస్తూ ఉంటాడు. వ్యక్తిగత జీవితంలో శశిరేఖను(నయనతార) పెళ్లి చేసుకున్న ప్రసాద్ కొన్ని కారణాల వల్ల ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. ఆరేళ్ళ పాటు పిల్లలకు దూరంగా ఉన్న ప్రసాద్ పీఈటీ టీచర్ గా పరిచయమై పిల్లల్ని ఎలా ఆకట్టుకున్నాడు? శశిరేఖకు బుద్ది చెప్పడానికి ఏం చేశాడు? శశిరేఖ తండ్రికి ఏ విధంగా చుక్కలు చూపించాడు? వెంకీ గౌడ, శశిరేఖ మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ:
మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ఆ లోటు తీరిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో సైతం ఈ సినిమాకు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వస్తోంది. చిరంజీవిని అభిమానులు ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారో ఈ సినిమాలో అదే విధంగా చూపించారు. చిరంజీవి స్టైల్ కు అనుగుణంగా కంఫర్ట్ జోన్ లో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు.
వాస్తవానికి ఈ సినిమాలో మరీ అద్భుతమైన కథ ఉండదు. రొటీన్ కథనే ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ విధానంలో చెప్పి అనిల్ రావిపూడి మరో సక్సెస్ సాధించారు. ఈతరం డైరెక్టర్లలో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడికే దక్కుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సమయానుగుణంగా సుందరీ పాటను వాడుకున్న విధానం బాగుంది.
హీరోను సింపుల్ రోల్ లో చూపిస్తూనే డైలాగ్స్ తో దర్శకుడు మ్యాజిక్ చేశారు. వింటేజ్ చిరంజీవిని తెరపై చూపించే విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. చిరంజీవి నయనతార మధ్య కెమిస్ట్రీ బాగుంది. చిరంజీవి ఏడు పదుల వయస్సులో కూడా ప్రేక్షకులను మెప్పించేలా కనిపించి ఆకట్టుకున్నారు. చిరంజీవి మేనరిజాన్ని హైలెట్ చేసే సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
అయితే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అయ్యాయనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. అమ్మాయిల బిహేవియర్ గురించి అల్లుకున్న సీన్స్ బాగున్నాయి. వెంకీ గౌడ పాత్రలో వెంకటేశ్ ఎంట్రీ అదిరిపోవడంతో పాటు చిరంజీవి, వెంకటేశ్ లను తెరపై చూసినప్పుడు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. క్లైమాక్స్ రొటీన్ గానే ఉన్నా ప్రేక్షకులు సంతృప్తితోనే థియేటర్ నుంచి బయటకు వస్తారు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావడం ఈ సినిమాకు అదనపు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
టెక్నీకల్ గా కూడా ఈ సినిమా బాగుంది. భీమ్స్ మ్యూజిక్, బీజీఎంతో మ్యాజిక్ చేశారు. మీసాల పిల్ల, హుక్ స్టెప్, శశిరేఖ పాటలు తెరపై బాగున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.
బలాలు : అనిల్ రావిపూడి డైరెక్షన్, చిరంజీవి యాక్టింగ్, వెంకటేశ్ గెస్ట్ రోల్, కామెడీ సీన్స్
బలహీనతలు : సెకండాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్ : 3.5/5.0
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి