ప్రపంచ నలుమూలలా ఉన్న గాంధీ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు భారత దేశం కోసం విరాళాలు సేకరిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న పూర్వ విద్యార్థుల తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గాంధీ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా ఆపత్కాలంలో భారత్ కి అండగా నిలుస్తున్నారు. నార్త్ కెరొలిన లో ఇంటర్నల్ మెడికల్ వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ రేణుక అనంత్ కళ్యాణ్ కడలి.. ఇండియానాపోలిస్ లో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్న ఆదిత్య రెడ్డి కలిసి "గాంధీయులు" అనే ఒక మిషన్ స్టార్ట్ చేసి కరోనా పోరులో భారత్ కి సహాయం చేస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశారు. పదివేల ఎన్ 95 మాస్కులు, 610 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, 485 ఆక్సిజన్ సిలిండర్లు, పల్స్ ఆక్సి మీటర్లు పలు ఆసుపత్రులకు పంపించారు. కరోనాతో బాధపడే పేదవారికి తక్కువ ధరలకే చికిత్స అందాలనే ఉద్దేశంతో గాంధీ కాలేజీ పూర్వ విద్యార్థులు తమకు సాధ్యమైనంతవరకు వైద్య సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు సరఫరా చేసే విషయంలో కూడా ఎన్ఆర్ఐ డాక్టర్లు సహాయం చేస్తున్నారు. వర్చువల్ మీటింగ్స్ ద్వారా భారతదేశంలోని రూరల్ వైద్యులకు సలహాలు ఇస్తున్నారు.

అయితే గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఇప్పటికే లక్ష డాలర్లకు పైగా విరాళాలు సేకరించారు. ఇంకొద్ది వారాలపాటు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని.. అత్యవసరమైన వైద్య సామాగ్రిని కొనుగోలు చేసి భారత్ కి పంపిస్తామని ప్రవాసులు చెబుతున్నారు. ఇకపోతే మే నెలలో విపరీతంగా విజృంభించిన కరోనా.. జూన్ నెల నాటికి కాస్త తగ్గుముఖం పట్టింది. నాలుగు లక్షల చేరువలో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం లక్షన్నర కంటే ఎక్కువగా నమోదు కావడం లేదు. రోజువారీ కరోనా మరణాల సంఖ్య కూడా కాల క్రమేణా తగ్గుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: