మ‌హారాష్ట్రలో రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న ఉదయం బీజేపీ, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీ, అజిత్ పవార్‌ను మభ్యపెట్టి అతని సహకారం తీసుకుందనీ.. ఈ ప్రభుత్వం మూడు రోజుల ముచ్చటేనని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్.. బీజేపీపై మండిపడ్డాయి. గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ రాజ్యాంగానికి విరుద్దంగా, బీజేపీ కోవర్టుగా మారారని అతనిపై, బీజేపీపై చర్యలు తీసుకోవాలని శివసేన, ఎన్సీపీ- కాంగ్రెస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప‌రిణామాల‌న్నింటి కంటే...అంద‌రి చూపు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేపై ప‌డింది. ఆమె త‌మ ఆవేద‌న‌ను మ‌హారాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాల‌ను వ్య‌క్తీక‌రిస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ప‌రిణామంగా...బీజేపీకి  ఎన్సీపీ నేత అజిద్‌ పవార్‌ మద్దతు ఇచ్చి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. `కుటుంబంలో పార్టీలో చీలిక వ‌చ్చింది`అని తొలి రోజు  వాట్సాప్‌ స్టేటస్ పెట్టిన సుప్రియా సూలే... దానికి కొన‌సాగింపుగా...తాజాగా అజిత్‌ పవార్‌ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇవాళ ఉదయం తన వాట్సాప్‌ స్టేటస్‌లో రెండు అంశాలు లేవనెత్తారు.  ``గుడ్‌ మార్నింగ్‌.ఎప్పటికైనా విలువలే గెలుస్తాయి. నిజాయితీ, కష్టం వృధాగా పోవు. నిజాయితీతో పనిచేయడం కొంచెం కష్టమైనా..దాని ఫలితాలు ఎక్కువ కాలం ఉంటాయని’ అప్‌డేట్‌ పెట్టారు. ‘అధికారం వస్తుంటుంది..పోతుంటుందని నేను నమ్ముతా. కానీ వాటికన్నా బంధాలు చాలా ముఖ్యమైనవి’ అని ఒక స్టేటస్‌ అప్‌డేట్‌ పెట్టారు.

 


కాగా, ఎన్‌సీపీ ఎమ్మెల్యేల స‌మావేశం జ‌రిగింది. బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో...ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఎన్సీపీ వారిని ముంబయిలోని లలిత్ హోటల్‌లో ఉంచింది. ఈ సందర్భంగా శరద్‌పవార్ వారితో మాట్లాడారు. మహారాష్ట్రలో మన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, సంజయ్‌రౌత్ హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆందోళన చెందవద్దనీ.. మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఉద్దవ్ వారికి భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: