ప్రముఖ పర్యాటక ప్రదేశం పాపికొండల టూర్ కు నేటి నుంచి అనుమతిస్తున్నారు. 2019 సెప్టెంబర్ లో కచ్చులూరు బోటు ప్రమాదం.. ఆ తర్వాత కరోనా విజృంభించడంతో అప్పటి నుంచి పాపికొండల్లో బోటు సర్వీసులు నిలిచిపోయాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. పర్యాటకానికి వచ్చే ఆదాయం పూర్తిగా దెబ్బతినడంతో ఏపీ ప్రభుత్వం మళ్లీ పాపికొండల టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పాపికొండలు దట్టమైన అడవులతో ఉండే పర్వత ప్రాంతం. పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో ఉండే చెట్లు ఎక్కువగా ఆకులు రాల్చవని చెబుతారు. సుందరంగా, ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రదేశానికి వెళ్లాలంటే అందరూ ఆసక్తి చూపిస్తారు. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము చూస్తే ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీరం అనకుండా ఉండలేము. ముఖ్యంగా వేసవిలో ఇక్కడికి రావాలంటే పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు.

గోదావరిలో పర్యాటక బోట్ల రాకపోకలు బాగా పెరిగాయి.  సుమారు 100కి పైగా బోట్లు భద్రాచలం దిగువన వీఆర్ పురం మండలం నుంచి పాపికొండల వరకూ వస్తాయి. ఇక రాజమండ్రి వైపు నుంచి పోశమ్మ గండి, పోలవరం నుంచి కూడా బోట్లు బయలుదేరి పాపికొండల వరకూ వెళతాయి. అటూ ఇటూ బయలుదేరే ఈ బోట్లపై ఆధారపడి అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. పర్యాటకులయితే పాపికొండల్లో విహారం ద్వారా ఎంతో ఆనందాన్ని.. ఆహ్లాదాన్ని అనుభవిస్తుంటారు.  

పాపికొండల దగ్గర గోదావరి నది రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది. రాజమండ్రి నుండి లాంచీ ప్రయాణం టూరిస్టులకు మంచి అనుభవాన్ని తెచ్చిపెడుతుంది. పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ  మొక్కలు, వృక్షాలు ఉంటాయి. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి లాంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు. అయితే కరోనా సమయంలో గోదావరిలో విహార యాత్రకు అనుమతినివ్వడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: