పి.వి. సింధు.. ఇప్పుడు దేశం మొత్తం మోగిపోతున్న పేరు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశానికి రెండో పతకం సాధించిన వనిత. అలాగే వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణి. అంతే కాదు.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మూడో క్రీడాకారిణిగానూ సింధు రికార్టు సాధించింది. అయితే.. సింధు ఇన్ని విజయాలు సాధించడం వెనుక ఓ వ్యక్తి కృషి కూడా ఉంది. అతనే సింధు కోచ్.. అతని పేరు పార్క్‌ తే సంగ్‌.


ఇంతకీ ఈ పార్క్‌ తే సంగ్‌ ఎవరు.. ఈయన  ఒకప్పటి దక్షిణ కొరియా బ్యాడ్మింటన్‌ ఆటగాడు. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌ వరకూ వెళ్లాడు పార్క్‌ తే సంగ్‌. 2004లోనే పార్క్‌ తే సంగ్‌ ఆసియా ఛాంపియన్‌ షిప్స్‌లో కాంస్యం సాధించాడు. అంతే కాదు.. 2002 ఆసియా క్రీడల్లో గోల్డ్ సాధించిన పురుషుల టీమ్‌లో సభ్యుడు. ఆ తర్వాత రిటైర్ అయ్యి.. కోచ్‌గా మారాడు. 2013 నుంచి 2018 వరకూ పార్క్‌ తే సంగ్‌.. కొరియా జట్టుకు కోచ్‌గా పని చేశాడు.


2019లో పార్క్‌ తే సంగ్‌ భారత క్రీడా ప్రాధికార సంస్థకు కోచ్‌గా వచ్చాడు. సింధుకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. సింధు ఆటలో ఎప్పటికప్పుడు  మార్పులు తెచ్చాడు. సింధును  వెన్నుతట్టి ముందుకు నడిపించాడు. సింధు ప్రత్యర్థుల ఆటతీరును అధ్యయనం చేసి.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాడు. అలా పార్క్‌ తే సంగ్‌ సింధు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.


సింధు ఆటతీరులో లోపాలు సవరించాడు. ఒకేసారి నలుగురితో సింధును ఆడించేవాడు.. అలా సింధు ఆటతీరు బాగా మార్చేశాడు. సింధు కోసం 2019 నుంచి పార్క్ ఇండియాలోనే ఉంటున్నాడు. ఏడాదిన్నర నుంచి కుటుంబాన్ని కూడా చూడలేదతను. పార్క్‌కు నాలుగేళ్ల కూతురు ఉంది. పాపం.. సింధు కోసం ఆయన ఆ పాపను కూడా ఏడాదిన్నరగా చూడలేదు. సింధు కోసం అంతగా త్యాగాలు చేసిన పార్క్‌.. ఇప్పుడు సింధు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: