తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా పార్టీల మధ్య సవాళ్ల పర్వాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికి వారే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా  ముందుకు సాగుతున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉంది..? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  కీలక నియోజకవర్గాల్లో అచ్చంపేట ఒకటి. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నియోజక వర్గం ఉంది. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2008లో పునర్వ్యవస్థీకరణ తర్వాత నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి మండలం లోని 14 గ్రామాలు కల్వకుర్తి నియోజకవర్గానికి తరలించగా ఒంగోరు మండలం పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో కలిసింది. పునర్వ్యవస్థీకరణ తరువాత మూడు సార్లు ఎన్నికలు జరిగ్గా రెండుసార్లు టిఆర్ఎస్ నుండి పోటీచేసిన గువ్వల బాలరాజు విజయం సాధించారు. టిడిపి ఆవిర్భావం నుండి ఆ పార్టీకి మద్దతుగా ఉన్న ఈ నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత తెరాస హవా మొదలైంది.

 2014లో దాదాపు 12 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన గువ్వల బాలరాజు, 2018 ముందస్తు ఎన్నికలలోనూ విజయం సాధించి రెండోసారి అసెంబ్లీ లో అడుగు పెట్టారు. కాంగ్రెస్ నేత డా.చిక్కుడు వంశీకృష్ణకు పై దాదాపు తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అచ్చంపేటలో తన ఆధిక్యాన్ని చాటిచెప్పారు. దాదాపు రెండు లక్షల 36 వేల ఓటర్లు ఉన్న అచ్చంపేటలో గువ్వల బాలరాజు వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లోనూ మొత్తం 20 వార్డుల్లో 14 కారు ఖాతాలో పడడంలో గువ్వల బాలరాజు కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా దూకుడు చూపుతూ , ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. గువ్వల బాలరాజు 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే అయి ఏడేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా కూడా మూడేళ్లు పూర్తి చేసుకుంటున్నారు. మొత్తమ్మీద చూసినట్లయితే ఎమ్మెల్యే పనితీరుతో కొన్ని వర్గాలు సంతృప్తిగానే ఉన్న నియోజకవర్గంలోని ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు గువ్వల బాలరాజు అందించ లేకపోయారు. 7 ఏళ్ల తన పాలనలో ఆశించిన అభివృద్ధి జరగలేదనేది అచ్చంపేట ప్రజల మాట. అలాగే దూకుడు, మాటతీరు మైనస్ అయ్యాయి. ప్రభుత్వ ఫలాలు కొందరికి మాత్రమే అందడం కలిసి రాలేదు. ఇక రాజకీయంగా కాంగ్రెస్ నేత వంశీకృష్ణకు ప్రజల్లో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో బాలరాజు మరింత మెరుగ్గా ఈ రెండేళ్ళు పని చేయాల్సిన పరిస్థితి  ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: