పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో సహా పార్టీ ముఖ్యనేతలు నేడు ఢిల్లీకి వెళ్లారు. మొత్తం 13 మందికి అధిష్టానం పిలుపు ఇచ్చింది. ఈ మీటింగ్‌లో హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఓటమిపై అధిష్టానం సమీక్ష నిర్వ‌హించ‌నుంది. ఇప్పటికే హుజురాబాద్ ఫలితాలపై అధ్యయనం చేసేందుకు కర్ణాటక మాజీ ఎమ్మెల్యే నంజన్యన్ మత్ ఆధ్వర్యంలో కమిటీ ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అధ్య‌యనం చేసి నివేదిక స‌మ‌ర్పించ‌డానికి నెల రోజుల స‌మ‌యం ఇచ్చింది ఢిల్లీ అధిష్టానం.


గత ఉపఎన్నికల ఓటమిపై ఎందుకు సమీక్షించ లేదని  కొందరు సీనియర్లు ప్రశిస్తున్నారు. దుబ్బాక, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసి ఓటమి పైనా చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. ఇదే డిమాండ్ తో కేసి వేణుగోపాల్ కు లేఖ రాశారు. హైకమాండ్ హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాల‌కే పరిమితం అవుతుందా .. లేక అన్నింటి పైనా చర్చిస్తుందా అనే ఉత్కంఠ నెల‌కొంది. రేవంత్ రెడ్డి సార‌థ్యంలో వ‌చ్చిన మొద‌టి ఉప ఎన్నిక కావ‌డ‌డం.. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోర ప‌రాభ‌వాన్ని ఎదుర్కొంది.


  మ‌రోప‌క్క కాంగ్రెస్ లోపాయికారిగా బీజేపీ గెలుపున‌కు స‌హ‌క‌రించింద‌నే వాద‌నలు ఉన్నాయి. ఈ విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర మాట‌ల యుద్ధం కూడా న‌డిచింది.  సీనియ‌ర్ నాయ‌కులు దొరికిందే ఛాన్స్ అన్న విధంగా టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దుమారం తీవ్ర త‌రం కావ‌డంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట‌మిపై అధిష్టానం దృష్టి సారించింది.



 ఇప్ప‌టికే ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను అధిష్టానానికి పంపించింది తెలంగాణ కాంగ్రెస్‌. హుజురాబాద్ ఉప ఎన్నిక‌పై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొన‌డంతో కూడా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడిప్పుడే తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం రావ‌డం, హుజురాబాద్ ఓట‌మి చ‌విచూసిన‌ నేప‌థ్యంలో ఈ రోజు జ‌రిగే స‌మీక్ష స‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో తీవ్ర ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: