కరోనా.. మన జీవితాలను చాలా మార్చేసింది.. కొన్ని కొత్త అలవాట్లు తీసుకొచ్చింది.. మన జీవన విధానాన్ని, ఆలోచనలను కూడా మార్చేసింది. ఈ మార్పు ఎంతగా వచ్చిందంటే.. కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని చెప్పుకునే స్థాయిలో ఉంది. కరోనా కాలంలో ఎందరో మన కళ్ల ముందే రాలిపోయారు.. ఎంతో ఆరోగ్యవంతులు అనుకున్నవారు కూడా పిట్టల్లా రాలిపోయారు. దీంతో.. జనంలో ఒక విధమైన వైరాగ్యం వచ్చేసింది. ఎంత సంపాదించినా.. ఎంత కూడబెట్టినా.. దాన్ని అనుభవించాలంటే ముందు బతికి ఉండాలి కదా అన్న జ్ఞానం గుర్తుకొచ్చింది.


కరోనాకు ముందు జనం పొదుపుకు ప్రాధాన్యం ఇచ్చేవారు.. భవిష్యత్ ప్రణాళికల కోసం క్రమశిక్షణ పాటించేవారు. కానీ.. ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గిపోయిందట. కరోనా మహమ్మారి తర్వాత ఇంటికే పరిమితమైన ప్రజలు ఇప్పుడు జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారట. నిన్న తిరిగిరాదు.. రేపుకు రూపులేదు.. ఇవాళ ఒక్కటే నిజం అంటూ వర్తమానంలో బతికేందుకు ఇష్టపడుతున్నారట. డెలాయిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారతీయులు ప్రస్తుత ఆలోచనా విధానం ఎలా మారిందో ఈ సర్వే చెబుతోంది.


గతంలో పోలిస్తే.. ఇప్పుడు భారతీయులు అర్థవంతంగా ఖర్చు చేస్తున్నారట. వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. అంతే కాదు.. జీవితంలో  కొత్త అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారట. అదే సమయంలో జీవితంలో బాలెన్స్ ఉండాలని కోరుకుంటున్నారట. ఇదే సమయంలో కరోనా చాలా మందికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పిందట. ఉపాధి అవకాశాలు, ఆర్జన తగ్గిపోవడంతో ఖర్చులు తగ్గించుకోవడం.. అనవసర ఖర్చులు చేయకపోవడం అలవాటవుతోందట.


ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితే.. ఓవైపు పొదుపు చేయాలి.. మరోవైపు ఉన్నదాన్ని అనుభవించాలి.. ఇదీ ఇప్పుడు కరోనా తర్వాత భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పు.. మరి మీరు కూడా ఒక్కసారి మీ జీవన విధానాన్ని బేరీజు వేసుకోండి. వర్తమానంలో బతకడం నేర్చుకోండి. అదే సమయంలో రేపటి గురించి కూడా కాస్త జాగ్రత్తపడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: