ఏపీ సీఎం జగన్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. గతంలో ఏ ముఖ్య మంత్రి చేయని విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఏపీలో దాదాపుగా ప్రతీ ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పధకం ద్వారా లబ్ధి పొందినవారే మనకు కనిపిస్తుంటారు. అంతలా ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని, ఎవరికీ ఆలోచన కూడా రాని పధకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేసి చూపిస్తున్నారు. ఆర్ధికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూనే తనదైన రీతిలో పథకాలన్నిటికీ నిధులను సమకూరుస్తున్నాడు.

సంక్షేమ పథకాలంటే కేవలం వృద్దులకు పెన్షన్, రేషన్ కార్డులు కాదని.. ఇంకా మరెన్నో ఉంటాయని చూపించారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అమ్మఒడి పధకాన్ని తీసుకొచ్చారు. ఈ పధకం ద్వారా నేరుగా చదువుకునే బిడ్డలున్న ప్రతీ తల్లి బ్యాంక్ ఖాతాలోకి 15వేల రూపాయల నగదును జమ చేస్తున్నారు. పేదప్రజలు మంచిఇళ్లలో ఉండాలని, ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇచ్చి, ఇల్లు కూడా కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఎప్పుడు వస్తుందో తెలియని పెన్షన్ ను ప్రతీనెలా కచ్చితంగా ఒకటవ తేదీనే జీతాలు వచ్చినట్టుగా వచ్చేలా చూస్తున్నారు. పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని.. విద్యావ్యవస్థ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. పరిపాలనను సుగమం చేశారు సీఎం జగన్.

సంక్షేమం ఒక్కటే సరిపోదని బలంగా నమ్మిన సీఎం జగన్.. అభివృద్ధి విషయంలోనూ, దాని ఆచరణలోనూ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మూడు రాజధానుల కార్యక్రమాన్ని ఎన్ని అవరోధాలు వచ్చినా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణాలకు కూడా భారీగా నిధులను వెచ్చించి.. వాటిని పూర్తి చేసేలా ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. 2024నాటికి రాష్ట్రాన్ని మరో మెట్టు ఎక్కించాలని కృషి చేస్తూ ముందుకు సాగిపోతున్నారు సీఎం జగన్. అయితే సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ కి వచ్చిన మార్కులు.. అభివృద్ధి విషయంలో తగ్గిపోయాయి. ప్రాజెక్ట్ లు సకాలంలో పూర్తి కాలేని పరిస్థితి. మూడు రాజధానుల జీవో వెనక్కి తీసుకున్నారు, కొత్త జీవోకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు తేలి కనిపిస్తున్నాయి. వీటికి మోక్షం ఎప్పుడో తెలియదు. ఇలాంటి సందర్భంలో జనం అభివృద్ధి కార్యక్రమాలను కూడా పట్టించుకుంటరా.. లేక సంక్షేమం ఒక్కటే చాలని పథకాలతో సంతృప్తి పడతారా..? కనీసం 2024 ఎన్నికలనాటికయినా జగన్ అభివృద్ధిని కూడా సంక్షేమం స్థాయికి తీసుకుని వెళ్లగలరా..?

మరింత సమాచారం తెలుసుకోండి: