కొన్ని సార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయాలు సబ్జెక్ట్ ఉన్నా కూడా రివర్స్ లో తగులుతుంటాయి. సరిగ్గా పాయింట్ జనాల్లోకి వెళ్లకపోతే ట్రోలింగ్ తప్పదు. సరిగ్గా ఇప్పుడు ఇదే విషయంలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్. వైసీపీకి చెందిన ఈ యువ ఎంపీ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గా ఉన్న సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందించారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంపై వస్తున్న స్పందనలపై ఆయన సెటైరిక్ గా ఓ ట్వీట్ వేశారు. అయితే ఆ ట్వీట్ ఆయనకే రివర్స్ లో తగిలింది. ఆ ట్వీట్ కి వచ్చిన రిప్లైస్ లో చాలా వరకు వ్యతిరేకంగానే ఉన్నాయి.

 

తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉందని, ఏపీలో లేదని, కానీ సినీ పరిశ్రమకు వస్తున్న ఆదాయంలో 70శాతం ఏపీ నుంచే వస్తోందని ట్వీట్ చేశారు ఎంపీ భరత్ రామ్. లైట్ బాయ్ నుంచి స్టార్ హీరో వరకు ప్రతి ఒక్కరూ ఏపీనుంచి సంపాదిస్తున్నారని అన్నారు. ఏపీనుంచి ఆదాయం వస్తుంది కాబట్టి.. ఏపీలో ఇండస్ట్రీ పెట్టాలని ఆయన వారిని ఆహ్వానించారు. వాస్తవానికి ఏపీలో తెలుగు సినీ ఇండస్ట్రీని పెట్టాలనే వాదన, డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. దీనికి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో స్టూడియోలకు అలవాటు పడి, అక్కడి వాతావరణాన్ని ఇష్టపడిన ఇండస్ట్రీ వ్యక్తులు ఏపీకి రాలేకపోతున్నారు. దీంతో ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. షూటింగ్ లకోసం వస్తుంటారు కానీ, సినీ ఇండస్ట్రీ మొత్తం, లేదా కొంత భాగం ఏపీకి రావడం ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదు.

కానీ ఎంపీ భరత్ రామ్ చేసిన కామెంట్ లో ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటూనే.. వారి సంపాదన ఇక్కడినుంచే వస్తుంది కదా అనే పాయింట్ టచ్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయన్ని ఓ ఆటాడేసుకుంటున్నారు. వైసీపీకి చెందిన సాక్షి పేపర్ ఆఫీస్ ఎక్కడుందని, అది హైదరాబాద్ లోనే ఉంది కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ పత్రిక మెయిన్ ఆఫీస్ కూడా ఏపీలో పెట్టొచ్చు కదా అంటున్నారు. మరికొందరేమో.. రాజమండ్రిలో వచ్చే కలెక్షన్ల గురించే ఎంపీ మాట్లాడితే బాగుంటుందని కామెంట్ చేశారు. విచిత్రం ఏంటంటే.. ఎంపీ తన ట్వీట్ లో మెన్షన్ చేసిన @goap అనే ట్విట్టర్ హ్యాండిల్ కి అసలు ఏపీ ప్రభుత్వానికే సంబంధం లేదు. బాధ్యతగల పదవిలో ఉన్న ఎంపీ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వేసిన ట్వీట్ లో ప్రభుత్వానికి సంబంధం లేని ట్విట్టర్ హ్యాండిల్ పేరు ప్రస్తావించడాన్ని కూడా కొంతమంది తప్పుబడుతున్నారు. ప్రభుత్వం గురించి, ప్రభుత్వ వెబ్ సైట్లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల గురించి కాస్త తెలుసుకుని ఉండాలంటూ హితవు పలుకుతున్నారు. మొత్తమ్మీద టికెట్ల వ్యవహారంపై ట్వీట్ వేసి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు యువ ఎంపీ భరత్ రామ్.


మరింత సమాచారం తెలుసుకోండి: