హైదరాబాద్ లో చాలామంది కరోనా టెస్టులకు దూరంగా ఉంటున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నా మందుల షాపుల్లో మందులు కొనుక్కొని ఉపశమనం పొందుతున్నారు. పాజిటివ్ వస్తే ఇంటిల్లిపాది బాధ పడాల్సి వస్తోందని టెస్టులకు దూరంగా ఉంటున్నారు. కొందరు స్థానిక వైద్యులను సంప్రదించి తగ్గకపోతే టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే వెదర్ లో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు సహజమంటున్నారు.

ఇక ఐఐటీ హైదరాబాద్ లో కరోనా కలకలం రేగింది. 119మంది ఐఐటీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు యాజమాన్యం వెల్లడించింది. వారికి స్వల్ప లక్షణాలు ఉన్నాయనీ.. క్యాంపస్ లోనే ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేశామని తెలిపింది. అటు కర్నూల్ మెడికల్ కాలేజీలో 22మంది స్టూడెంట్లకు కరోనా వచ్చింది. దీంతో ఈ నెల 17వరకు సెలవులు ప్రకటించారు.


ఇక తెలంగాణ జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ప్రభుత్వం పూర్తి వసతులు కల్పించిందని వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్ కు రోగులను రిఫర్ చేయవద్దని వైద్యులకు సూచించారు. కరోనా కారణంగా గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు, డిశ్చార్జ్ అయిన వారి వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 4వేల 868 ఒమిక్రాన్ కేసులు రాగా అందులో 1805 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1,281, రాజస్థాన్ లో 645, ఢిల్లీలో 546 కేసులు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 54, తెలంగాణలో 123కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో కరోనా రోజువారీ కేసులు, మరణాల సంఖ్య మరోసారి పెరిగింది. అంతకుముందు 1.68లక్షల కేసులు రాగా.. ఈరోజు లక్షా 94వేల 720 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 277మంది మరణించగా.. గత 24గంటల్లో 442మందికరోనా కాటుకు బలయ్యారు. అటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4వేల 868కి పెరిగింది. పాజిటివిటీ రేటు 11.05శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 9లక్షల 55వేల 319యాక్టివ్ కేసులున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: