భారత దేశ రాజకీయాల్లో ఆ పేరు చెబితే చాలు సాక్షాత్తు ప్రధాన మంత్రులు సైతం భయపడతారు. కేవలం కనుసైగతోనే వేలాది మంది ప్రజలను అదుపు చేయడం లో అతన్ని మించిన నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ముస్లిం మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి అన్ని పార్టీలు ఆపసోపాలు పడుతున్న సమయంలో వాళ్ళ ఓట్ల కంటే దేశంలో ఉన్న హిందూ ప్రజలను , సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటమే తన లక్ష్యం ధైర్యంగా చెప్పి వారి గుండెల్లో హిందూ హృదయ సామ్రాట్ గా నిలిచిపోయిన వ్యక్తి . ఇంతకీ అతను ఎవరో తెలుసా ? 


బాల్ థాక్రే  దేశ రాజకీయాల్లో, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పోరాటంలో ఈ పేరు కు ముగింపు లేదు ఉండదు. కార్టూనిస్ట్ నుండి హిందూ హృదయ సామ్రాట్ గా ఎదిగిన తీరు ఆద్యంతం ఆసక్తికరం. ఈరోజు ఆయన 9వ జయంతి. ఆయన ఎంతో అభిమానించే స్వాతంత్ర్య సమరయోధులు , భారత ఆర్మీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ జన్మదినం కూడా ఈరోజే. థాక్రే గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు.




 థాక్రే పూర్తి  పేరు బాల్ కేశవ్ థాక్రే , ప్రస్తుత మహారాష్ట్ర లోని పుణె పట్టణంలో 1926, 23 జనవరి న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కేశవ్ థాక్రే, రామబాయ్.ఈ దంపతులకు 8 సంతానంలో పెద్ద వాడు బాల్ థాక్రే .తండ్రి కేశవ్ థాక్రే ప్రముఖ మరాఠీ రచయిత, జర్నలిస్టు, సంఘ సంస్కర్త మరియు సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు.


థాక్రే అసలు ఇంటి పేరు పాన్ వెల్కర్ కానీ ప్రముఖ బ్రిటిష్ రచయిత విలియం మాకేపీస్ థాక్రే మీద వ్యక్తిగత అభిమానంతో వీరి తండ్రి తన ఇంటి పేరును థాక్రే గా మార్చుకున్నారు. ఆలా వాళ్ళ ఇంటి పేరు థాక్రే గా స్థిరపడింది. థాక్రే మీద తండ్రి కేశవ్ సీతారామ్ థాక్రే రచనలు, సిద్ధాంతాల ప్రభావం అధికంగా ఉండేది,ఆ విధంగా తండ్రి సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితుడయ్యాడు. తన తండ్రి లాగే జర్నలిజం మీద ఆసక్తి పెంచుకొని పిన్న వయస్సులో నే జర్నలిజం రంగంలోకి ప్రవేశించారు. 



థాక్రే కు బొమ్మలు గీయడం అంటే చిన్నతనం నుంచే ఏంతో ఆసక్తి. కానీ జర్నలిస్టుగా మారిన తర్వాత సామాన్య జర్నలిస్టుగా కంటే కార్టూన్ జర్నలిస్ట్ గా కార్టూన్స్ ద్వారా ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపొచ్చు అని భావించి కార్టూన్ జర్నలిజం లోకి ప్రవేశించారు. కార్టూన్ జర్నలిస్టుగా ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫ్రీ ప్రెస్ జర్నల్ లో పనిచేశారు. 



ఫ్రీ ప్రెస్ జర్నల్ లో పనిచేస్తున్న సమయంలోనే తన కార్టూన్స్ బాగా పేలడంతో మంచి పేరుతో పాటుగా టైమ్స్ ఆఫ్ ఇండియా సండే ఎడిషన్ పత్రిక లో కూడా వచ్చేవి. కార్టూన్ జర్నలిజం లో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న సమయంలోనే ఫ్రీ ప్రెస్ జర్నల్ యాజమాన్యం తో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా తానే స్వయంగా ఒక  పత్రికను ప్రారంభించారు. న్యూస్ డే పేరుతో వచ్చిన ఆ దిన పత్రిక విజయవంతం కాకపోవడంతో మార్మిక్ అనే తొలి  మరాఠీ రాజకీయ  కార్టూన్ వార పత్రికను ప్రారంభించారు. మహారాష్ట్ర కు సంబంధించిన పలు సమస్యలు గురించి ఈ పత్రికలో వచ్చేవి. ఈ పత్రిక ప్రజల్లోకి బాగా వెళ్లడమే కాకుండా థాక్రే ఇమేజ్ ను అమాంతంగా పెంచింది. 



1966లో శివసేన పార్టీని స్థాపించిన థాక్రే తొలిసారిగా మహారాష్ట్రలో విద్య , ఉపాధి వంటి పలు అంశాల్లో మరాఠీ ప్రజానీకానికి మాత్రమే అవకాశాలు కల్పించాలని కోరుతూ మరాఠా ఆత్మ గౌరవం పేరుతో భూమి పుత్రుల(Sons Of Soil) ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం ద్వారా మరాఠ రాజకీయాల్లో తిరుగులేని నేత థాక్రే అవిర్భవించారు. 



థాక్రే ఆధ్వర్యంలో శివసేన పార్టీ 1970, 1980లలో మహారాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కావడం మాత్రమే కాకుండా దేశ ఆర్థిక రాజధాని బొంబాయి మున్సిపల్ కార్పోరేషన్ లో అధికారాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో థాక్రే స్థానాన్ని, శివసేన పార్టీ స్థానాన్ని సుస్థిరం చేయడంలో బొంబాయి మున్సిపల్ కార్పోరేషన్ విజయం తో పాటుగా పార్టీ అధికారిక మరాఠీ  పత్రికలు మార్మిక్,  సామ్నా  చాలా బాగా దోహద పడ్డాయి అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 



మహారాష్ట్ర లో కాంగ్రెస్ అధికారాన్ని కబళించడమే లక్ష్యంగా చేసుకున్న థాక్రే అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించి విజయవంతం అయ్యారు. 1990 ల నాటికి మహారాష్ట్ర లోని పలు గ్రామ, జిల్లా పరిషత్ మరియు పురపాలక సంఘాలను శివసేన కైవసం చేసుకుంది.కాంగ్రెస్ కు మద్దతు గా ఉన్న పలు కార్మిక సంఘాలను తన వైపు తిప్పుకుని కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేయడంలో విజయం సాధించారు. 




థాక్రే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం లో ఆయన్ని మించిన వారు లేరు.1995లో బీజేపీ తో కలిసి మహారాష్ట్ర లో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గా థాక్రే  అని అనుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తన ప్రధాన రాజకీయ అనుచరుడైన మనోహర్ జోషిని ముఖ్యమంత్రి గా ఎంపిక చేసి అందరిని విస్మయానికి గురి చేశారు. 




కింగ్ మేకర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం థాక్రే . ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించ కుండానే తన నివాసం మాతో శ్రీ నుంచే రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని శాసించారు . బొంబాయి పేరును ముంబై గా మార్చడంతో పాటుగా పాలన పరంగా పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రభుత్వం లో పాతుకుపోయిన కాంగ్రెస్ లోపాయికారులను అనగదొక్కడంలో కీలకంగా వ్యవహరించారు. 

థాక్రే తొలి నుంచి హిందుత్వ వాది , అందువల్ల  హిందుత్వ అజెండా అనుగుణంగానే పార్టీ విధానాలు రూపకల్పన చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సుస్థిర స్థానం వచ్చిన తర్వాత శివసేన పార్టీ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించారు. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తో జట్టు కట్టారు. బాబ్రీ మసీదు, బొంబాయి బాంబు పేలుళ్ల సమయంలో హిందువుల మీద దాడులు చేసి అతివాద ముస్లింల వారి శైలిలో శివసేన కార్యకర్తలు చెప్పిన సమాధానాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజంలో ఆయన స్థానం శిఖరానికి చేరింది.



వివాదాస్పద అంశాలపై స్పందించడంలో థాక్రే ఎల్లప్పుడూ ముందుడేవారు,రామాజన్మ భూమి వివాదం, దేశంలో పెరుగుతున్న రిజర్వేషన్లు గురించి తొలిసారిగా ఆయనే మాట్లాడారు , గోద్రా అల్లర్ల విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం తో విభేదించి మరి ప్రస్తుత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని సమర్థించారు, జర్మనీ  నియంత హిట్లర్ మీద బహిరంగంగా తన అభిమానాన్ని చాటుకున్నారు . 




"హిందూ హృదయ సామ్రాట్" , "అభినవ మరాఠా కేసరి" వంటి పలు బిరుదులను అందుకున్నటువంటి నాయకుడిగానే కాకుండా తన జీవన పర్యంతం నమ్మిన సిద్ధాంతం కోసం, తనను నమ్ముకుని నిర్భయంగా బ్రతుకుతున్న యావత్తు మరాఠా మరియు హిందూ సమాజం కోసం చివరి శ్వాస వరకు అహర్నిశలు పాటుపడ్డ మహా నేత బాలసాహెబ్ థాక్రే. 

మరింత సమాచారం తెలుసుకోండి: