రాజకీయ పార్టీలు ఉన్నది ఎందుకు.. ఇంకెందుకు అధికారం కోసం.. తమకు అధికారం ఇస్తే మీ సేవ చేసుకుంటామని పార్టీల నాయకులంతా చేతులు జోడించి వేడుకుంటారు.. ఎన్నికల ఫోటోల్లో చూడండి.. రెండు చేతులూ జోడించి.. ముకుళిత హస్తాలతో వినమ్రంగా దర్శనమిస్తారు.. రాముడు మంచి బాలుడు అన్న రీతితో మర్యాద రామన్న టైపులో ఫోజులిస్తారు. అయితే.. రాజకీయ పార్టీలను నడపడం అంటే అంత సులభం కాదు.. అంతా కోట్ల రూపాయలతో కూడుకున్నపని.. కార్యకర్తలను పోగేయాలి.. పార్టీ ఆఫీసులు మెయింటైన్ చేయాలి.. ఎన్నికల ప్రచారం చేయాలి.. సోషల్ మీడియాను మెయింటైన్ చేయాలి.


మరి ఇన్ని ఖర్చులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.. అందుకు కొన్ని మా‌ర్గాలు ఉన్నాయి. పార్టీ సభ్యత్వం ద్వారా కొంత డబ్బు వస్తుంది.. పార్టీపై అభిమానంతో కొందరు విరాళాలు ఇస్తారు. అంతే కాదు.. అనేక సంస్థలు పార్టీలకు విరాళాలు ఇస్తుంటాయి. ఇలా పార్టీకంటూ కొంత నిధి ఉంటుంది. అయితే.. గతంలో ఎన్నికల సంఘం పార్టీలు తమ నిధుల విషయం ఏటా ప్రకటించాలని ఆదేశించింది. ఈ మేరకు పార్టీలు తమ నిధుల వివరాలు ప్రకటిస్తున్నాయి.


2019-20 గణాంకాల ప్రకారం దేశంలోనే బీజేపీ ఎన్నికల నిధుల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ పార్టీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఏకంగా రూ. 4,847 కోట్ల రూపాయల ఆస్తులు ఆ పార్టీకి ఉన్నాయి. అంటే ఇదంతా డబ్బు కాదండోయ్.. బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్థిరాస్తులు, వాహనాలు, ఇతర ఆస్తులు అన్నీ కలుపుకుని అన్నమాట. అలా దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టిస్తోంది.


ఇక సంపన్న పార్టీల్లో రెండో స్థానంలో బీఎస్పీ ఉంది. ఈ పార్టీకి రూ.698 కోట్ల నిధులు ఉన్నాయి. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల విలువ రూ.588 కోట్లగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల్లో టీఆర్ఎస్‌ రూ. 301 కోట్ల ఆస్తులతో టాప్‌ ప్లేస్‌లో ఉంది.. వైసీపీ ఆస్తుల విలువ.. రూ.143 కోట్లు కాగా... టీడీపీ ఆస్తుల విలువ 188 కోట్లుగా ఈసీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: