తెలుగుదేశం పార్టీ ఘోర‌ప‌రాజ‌యంతో క‌నీసం పోస్టుమార్ట‌మ్ చేసుకుందామ‌న్నా ఆ పార్టీ నుంచి గెలిచిన త‌క్కువ మంది నేత‌ల్లోనే తీవ్ర‌మైన వైరుధ్యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో టీడీపీ కేవ‌లం విజ‌య‌వాడ ఎంపీ సీటుతో పాటు గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడ తూర్పు అసెంబ్లీ సీట్లు మాత్ర‌మే గెలుచుకుంది. విజ‌య‌వాడ ఎంపీ సీటు, ఈ రెండు అసెంబ్లీ సీట్లు స్థానికంగా కేశినేని నాని, వంశీ, గ‌ద్దె రామ్మోహ‌న్‌కు కాస్త మంచి పేరు ఉండ‌డంతో వాళ్ల వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో గెలిచారే త‌ప్పా అందులో చంద్ర‌బాబు, టీడీపీ గొప్పేం లేదు.


తాజాగా టీడీపీ అధిష్ఠానంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అలిగిన సంగతి తెలిసిందే. లోక్‌స‌భ‌లో త‌న‌కు ఇచ్చిన పార్టీ విప్ ప‌ద‌విని తిర‌స్క‌రిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపింది. తాను ఈ ప‌ద‌వికి అర్హుడిని కాన‌ని.. త‌ను ఈ ప‌ద‌వికి ఎంపిక చేసిన చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు అని కూడా వ్య‌గ్యంగా నాని స్పందించారు. ఈ పోస్టును చూస్తే ఎవ‌రికి అయినా నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ముక్కుసూటిగా ఉండే నాని చంద్ర‌బాబుపై ఇంత అల‌క ఎందుకు పూనారు ? అన్నదానిపై బెజ‌వాడ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చాలా చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. నాని అల‌క ప‌ద‌వుల కోసం కాద‌ని.. దీని వెన‌క  మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రావు ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. 


కృష్ణా జిల్లాలో టీడీపీని పూర్తిగా త‌న కాళ్ల కింద తొక్కి ప‌ట్టి ప్ర‌తి ఒక్క‌రిని రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కుతూ ఉమా గ‌త ప‌దేళ్లుగా రాజ‌కీయాలు చేస్తూ వ‌చ్చాడు. చివ‌ర‌కు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గాలు అయిన మైల‌వ‌రం, నందిగామ‌లో కూడా ఉమా అర‌చకాలు తారాస్థాయికి చేరిపోవ‌డంతో మైల‌వ‌రంలో ఉమాను చిత్తుగా ఓడించిన నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నందిగామ‌లో కూడా వైసీపీని గెలిపించారు. టీడీపీ ఎమ్మెల్యేల‌కు త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరు వ‌చ్చినా ఉమా త‌ట్టుకోలేర‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. 


అంతెందుకు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే పోల‌వ‌రం కాలువ నీళ్ల‌ను మోటారు ద్వారా తోడించిన వంశీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చెరువులు నింపి రైత‌లు పంట‌లు పండిచుకునేలా చేశాడు. ఇక్క‌డ వంశీకి క్రేజ్ రావ‌డంతో ఉమా బ‌ల‌వంతంగా మంత్రి హోదాలో ఆ మోటార్ల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నాలు చేశార‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై తీవ్రంగా వ‌చ్చాయి. ఉమాకు వంశీ, గ‌ద్దె రామ్మోహ‌న్‌, మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌, బోండా ఉమా, కేశినేని నాని ఇలా ఎవ్వ‌రితోనూ పొస‌గ‌దు. తాను చెప్పిందే వేదం అన్న‌ట్టుగా ఆయ‌న ఉంటాడు.


ఇక తాజాగా నాని అల‌క వెన‌క ఉమా పేరే ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల త‌ర్వాత అంద‌రికి అందుబాటులో ఉండేలా విజ‌య‌వాడ‌లో పార్టీ ఆఫీస్ క‌ట్టాల‌ని పార్టీ నేత‌లు చంద్ర‌బాబును కోరారు. ఈ బాధ్యతలను టీడీపీ అధినేత కేశినేని నానికి అప్పగించారు. వెంట‌నే నానికి చెప్ప‌కుండా ఈ బాధ్య‌త‌లు ఉమా చేతుల్లో పెట్టారు. ముందుగా త‌న‌కు ఇచ్చిన బాధ్య‌త‌ల‌ను మాట మాత్రం చెప్ప‌కుండా ఉమాకు ఇవ్వ‌డం.. అది కూడా ఈ ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి తెర‌వెన‌క కృషి చేసిన ఉమాకు ఈ బాధ్య‌త‌లు ఇవ్వ‌డంతో నాని చంద్ర‌బాబుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలిసింది. ఏదేమైనా జిల్లాలో చంద్ర‌బాబు ఉమాను న‌మ్ముకుంటే పార్టీని నాశ‌నం చేసేందుకు ఈ ఒక్క‌డు చాల‌ని టీడీపీ వాళ్లే చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: