జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి అడకత్తెరలో పడిన పోక చెక్కలాగ తయారైందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై పవన్ చాలా తీవ్రంగా మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే సమయంలో స్వయాన అన్న, మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్ ప్రతిపాదనకు జై కొట్టారు. అదే సమయంలో పార్టీ ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ కూడా జగన్ ప్రతిపాదన భేష్ అంటున్నారు.
అంటే ఇటు ఇంటిలోను అటు అసెంబ్లీలోను జగన్ ప్రతిపాదనకు మద్దతు వినబడుతుండటంతో పవన్ కు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. నిజానికి మూడు రాజధానుల ప్రతిపాదనపై అంత వేగంగా స్పందించాల్సిన అవసరం పవన్ కు లేదు. అయినా అంత వేగంగా ఎందుకు స్పందించేశారు ? ఎందుకంటే చంద్రబాబునాయుడు వ్యతిరేకించారు కాబట్టే తాను కూడా వ్యతిరేకించాలన్న ఆలోచనే తప్ప సొంత ఆలోచనంటూ ఏమీ కనబడలేదు.
అయితే జగన్ ప్రతిపాదనను పవన్ వ్యతిరేకించగానే సోదరుడు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలకగానే పవన్ ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. అదే సమయంలో ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ కూడా పవన్ గాలి తీసేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన చాలా మంచిదంటూ ప్రకటించారు. ఇటు అన్న అటు సొంత ఎంఎల్ఏ జగన్ కు జై కొట్టటంతో పవన్ కు నోట మాటరావటం లేదు.
చిరంజీవి, రాపాక ప్రకటనలతో సొంత ఇంట్లోతో పాటు పార్టీలోనే పవన్ కు మద్దతు లేదన్న విషయం అర్ధమైపోయింది. అందుకనే తమ అధినేతకు రెండు వైపులా వాయింపులు తప్పటం లేదని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. మొత్తానికి సమాజాన్ని మారుస్తానని, జగన్ కు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు చేస్తానని ఘనంగా చెప్పుకునే పవన్ కు ఎటువైపు నుండి కూడా మద్దతు దొరకటం లేదు. చంద్రబాబు కూడా రాజధానుల విషయంలో యూటర్న్ తీసేసుకున్నారు. పాపం పవన్ చివరకు ఒంటరైపోయాడనే అనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి