ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినేట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏపీ కేబినేట్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతికి ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ ఆమోదం తెలపటంతో ఏపీకి మూడు రాజధానులు ఇక లాంఛనమే అని చెప్పవచ్చు. వైజాగ్, కర్నూలు జిల్లాల ప్రజలలో మూడు రాజధానుల నిర్ణయానికి కేబినేట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. 
 
మరోవైపు మూడు రాజధానుల నిర్ణయానికి కేబినేట్ ఆమోదం తెలపడంతో రాజధానిగా అమరావతిని తీసేస్తున్నారని, అమరావతిని తరలిస్తున్నారని వస్తున్న వార్తలు కూడా నిజం కాదని నిరూపితమైంది. రాజధానిగా అమరావతి తీసేస్తున్నారనేది వాదనే తప్ప వాస్తవం కాదు. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, టీడీపీ పార్టీ నేతలకు కూడా తెలుసు. ఇప్పటికే ఇక్కడ ప్రముఖ విద్యాసంస్థలు ఉండగా ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 
 
భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఇక్కడికి రానున్నాయని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో కూడా జరగనున్నాయి కాబట్టి మూడు రాజధానులలో ఒకటైన అమరావతి వెలుగులు ఆగవనే చెప్పవచ్చు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలన్నీ పరిపాలన వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపాయి. 
 
కేబినేట్ ఆమోదం తెలిపిన మూడు రాజధానుల నిర్ణయంతో 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందనున్నాయి. అమరావతి ప్రాంతంలో కొంత భాగం వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు పెట్టిన వ్యయం వృథా కాకుండా అమరావతిని అభివృద్ధి చేయనుందని తెలుస్తోంది. ఉన్న వనరులతో నిర్మాణాలను పూర్తి చేయనుందని తెలుస్తోంది. అమరావతిలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి బదులుగా రాయలసీమ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించటానికి ప్రాజెక్టులను పూర్తి చేస్తే కొత్తగా 90 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించటంతో పాటు ఈ ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడిని ఐదు సంవత్సరాలలో వెనక్కు రాబట్టుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: