ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణ నిరూపణ కాని పక్షంలోనే ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని, సీనియర్ పోలీస్ అధికారి అనుమతి కూడా అక్కర్లేదని తేల్చిచెప్పింది.  

 

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణల తరుణంలో.. సుప్రీంకోర్టు పలు నిబంధనల్ని సడలిస్తూ 2018మార్చి 20న తీర్పు వెలువరించింది. దీంతో చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తీర్పుపై సమీక్ష కోరుతూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. దీంతో దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మార్చి 20 నాటి మార్గదర్శకాలని నిలుపుదల చేస్తూ అక్టోబరు 1, 2019న తీర్పు వెలువరించింది.

 

మార్చి 20 నాటి సుప్రీం మార్గదర్శకాలను నీరుగారుస్తూ కేంద్రం చట్టానికి సవరణలు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ పలువురు సుప్రీంను ఆశ్రయించారు. కేంద్ర సవరణలు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వపు హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్‌ వాదించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఎస్టీ, ఎస్టీలపై వివక్ష ఇంకా కొనసాగుతోందని.. ఈ నేపథ్యంలో కఠిన నిబంధనల్ని సడలించలేమని స్పష్టం చేసింది. 

 

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఏ వ్యక్తి పైనైనా కేసు నమోదైతే ఏడు రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి. ప్రాథమిక దర్యాప్తు జరిగినా, కేసు నమోదైనా నిందితుడి అరెస్టు అనివార్యం కాదు. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే, అతడిని అరెస్టు చేయడానికి అతడిని ఉద్యోగంలో నియమించిన వ్యక్తి అనుమతి తప్పనిసరి.  నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే అరెస్టు చేయడానికి ఎస్ఎస్‌పీ స్థాయి అధికారి ఆమోదం తప్పనిసరి.  ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్-18 ప్రకారం ముందస్తు బెయిలుకు వీలు లేదు. కోర్టు తన ఆదేశంలో ముందస్తు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ చట్టం కింద పెట్టిన కేసు దురుద్దేశపూరితంగా పెట్టిందని తేలితేనే ముందస్తు బెయిల్‌కు వీలు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: