పటాన్‌చెరు వెలిమెల నారాయణ కాలేజ్ లో నిన్న ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు విద్యార్థి సంఘాలు కళాశాల యాజమాన్యం వేధింపుల వలనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ ఆందోళనలకు దిగాయి. విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు సంధ్యారాణి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల అనుమతితో కాలేజీకి తరలించి నిరసన చేపట్టాలని భావించారు. 
 
విద్యార్థి సంఘాల నాయకులు, సంధ్య తల్లిదండ్రులు ఈరోజు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రి తాళం పగులగొట్టి సంధ్యారాణి మృతదేహం తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. విద్యార్థి సంఘాలు, యువతి తల్లిదండ్రులు మృతదేహం తీసుకొని గేటు వద్దకు వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంధ్య తల్లిదండ్రులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కాళ్లావేళ్లా పడినా పోలీసులు కనికరించలేదు. 
 
పోలీసులు సంధ్యారాణి తల్లిదండ్రులను విపరీతంగా కొట్టారు. ఒక కానిస్టేబుల్ మృతురాలి తండ్రిని బూటుకాలితో తన్నాడు. ఆ తరువాత సంధ్య తండ్రిని అక్కడినుండి ఈడ్చేశాడు.విద్యార్థి సంఘాలు సీరియస్ కావడంతో పోలీస్ అధికారులు కానిస్టేబుల్ రమేష్ ను అక్కడినుండి వెళ్లగొట్టారు.యువతి తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్ పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ లో ఐడీ పార్టీ పీసీగా పని చేస్తున్నాడు. కూతురు మరణంతో బాధలో ఉన్న తల్లిదండ్రులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు తెలంగాణ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా...? అని ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ ఘటనలో విద్యార్థి సంఘాలు కాలేజీ యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ రమేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఆత్మహత్య చేసుకున్న సంధ్యారాణి వెలిమెల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. నిన్న భోజన విరామ సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సంధ్యారాణి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: