మూడు తరాలుగా, రెండు రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్న కుటుంబం. దశాబ్దాల క్రితం నాయనమ్మ నడిచిన బాటలోనే ఇప్పుడు జ్యోతిరాదిత్య కూడా నడిచాడు. కాంగ్రెస్‌ పార్టీకి రాం రాం చెప్పి, కమలం పార్టీలో చేరారు. 

 

వందల ఏళ్ళ రాచరిక వారసత్వం... స్వతంత్ర భారతంలో 63 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబం అది. రాజమాత విజయరాజెతో రాజకీయాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మాధవరావ్ సింధియా, వసుంధర రాజె, యశోధర రాజెలతో విస్తరించాయి. ఇప్పుడు జ్యోతిరాదిత్యతో కలిపి, మూడు తరాలుగా,  రెండు రాష్టాల్లో గెలుపు ఓటములను సాధించే శక్తిని సంపాదించుకున్న కుటుంబం. అయితే, అప్పట్లో నాయనమ్మ నడిచిన బాటలోనే ఇప్పుడు మనవడూ నడవటం విశేషం.

 

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తూ పెద్ద షాక్ ఇచ్చిన జ్యోతిరాదిత్య, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కుదుపుకు కారణమయ్యారు. సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. ప్రస్తుతం జ్యోతిరాదిత్య రాజకీయ ప్రయాణానికి.. గతంలో అతని నాయనమ్మ విజయరాజె సింధియా ప్రస్థానానికి చాలా పోలికలున్నాయి. మధ్యప్రదేశ్‌ లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే అందుకు మనవడు ప్రధాన కారణమైతే, గతంలో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంలో విజయరాజె కీలకపాత్ర పోషించారు. 

 

 విజయరాజె సింధియా గ్వాలియర్‌ చివరి రాజు జీవాజీరావు సింధియా భార్య. విజయరాజె మొదట కాంగ్రెస్‌ లో చేరి, ఆ తర్వాత  జన్‌ సంఘ బాటపట్టారు. ఈ క్రమంలో నాటి ప్రభుత్వం పడిపోవటానికి కూడా కారణమయ్యారు. విజయరాజే కొడుకు మాధవరావు సింధియా మొదట జన్సంఘ్‌ లో ఉన్నా, ఆ తర్వాత కాంగ్రెస్‌ లో తిరుగులేని నేతగా ఎదిగారు. 

 

ఇక మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య తండ్రి బాటలో కాంగ్రెస్‌ లోనే దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగారు. గుణ లోక్‌ సభ స్థానం నుంచి మూడు సార్లు గెలుపొందారు. కానీ 18యేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న జ్యోతిరాదిత్య సింధియాకు ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు అసంతృప్తికి కారణమయ్యాయి. కొన్ని నెలల నుంచి కాంగ్రెస్ వ్యవహారాలతో అంటీముట్టనట్టుగా ఉంటున్న సింధియా చివరకు తన దారి తాను చూసుకున్నారు.
ఎన్నికలకు ముందే సింధియాను సీఎంను చేస్తానని రాహుల్ హామీ ఇచ్చినా, ఆ మాట నిలబెట్టుకోలేదు. రాహుల్ సూచనలను పక్కనపెట్టిన సోనియా కమల్‌ నాథ్‌ ను ముఖ్యమంత్రిని చేశారు. చివరికి సింథియా కమలం బాట పట్టేలా పరిణామాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: