స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో  సుప్రింకోర్టులో జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. వాయిదా పడిన ఎన్నికలను యథావిధిగా జరిపించాలనే విషయం వైసిపి ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ కేసును బుధవారం విచారించిన సుప్రింకోర్టు ఎన్నికల కమీషన్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోమని చెప్పేసింది. అంటే ఎన్నికలను వాయిదా వేయాలన్న ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ నిర్ణయమే ఫైనల్ అని తేలిపోయింది.

 

కాకపోతే జగన్ కు ఓ సానుకూల అంశం ఏమిటంటే ఎన్నికల కోడ్ ను సుప్రింకోర్టు ఎత్తేసింది. జగన్ ప్రిస్టేజ్ గా తీసుకున్న 25 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణి చేసుకోవచ్చంటూ అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ మరో మెలిక కూడా పెట్టింది. ఇళ్ళ పట్టాల పంపిణి కాకుండా మరేదైనా పథకం ప్రకటించేందుకు లేదని ఆంక్షలు విధించింది. ఇపుడు అమలు చేస్తున్న సంక్షేమపథకాలను కూడా అమలు చేసుకోవటంలో ఎటువంటి ఇబ్బంది లేదని కూడా స్పష్టం చేసింది.

 

ఎన్నికల వాయిదాను ప్రభుత్వం ప్రిస్టేజ్ గా తీసుకున్న సుప్రింకోర్టుకు వెళ్ళినా ఉపయోగం ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్నికల కమీషన్ నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఎందుకంటే ఎన్నికల వాయిదాకు కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కరోనా వైరస్ ను కారణంగా చూపించారు. నిజానికి ఏపిలో కరోనా వైరస్ ప్రభావం లేకపోయినా  ముందు జాగ్రత్త అని నిమ్మగడ్డ చెప్పటంతో కోర్టు కూడా తప్పు పట్టే అవకాశం లేదని అర్ధమైపోయింది. ఎందుకంటే ఇదే కారణంతో  కేసుల విచారణను వాయిదావేస్తున్న కోర్టు కమీషన్ నిర్ణయాన్ని ఎలా తప్పు పడుతుంది ?

 

ఎన్నికల వాయిదాకు తెర వెనుక కారణాలు ఏవైనా నిమ్మగడ్డ చెప్పింది మాత్రం సాంకేతికంగా కరోనా వైరస్ అని. ఎప్పుడైతే కరోనాను బూచిగా చూపించాడో అప్పుడే అర్ధమైపోయింది ఎన్నికల వాయిదా తప్పదని. కాకపోతే ప్రభుత్వం ఏదో ప్రిస్టేజ్ గా తీసుకుంది కానీ ఉపయోగం ఉండదని బహుశా ప్రభుత్వానికి కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే సంక్షేమ పథకాల అమలు, ఇళ్ళ పట్టాల పంపిణికి సుప్రింకోర్టు అనుమతి ఇవ్వటమే జగన్ కు ఊరట.

మరింత సమాచారం తెలుసుకోండి: