కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నా.. ఇంకా చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటున్నారు. వైరస్ ఎఫెక్ట్ కంటే దానిపై ప్రచారం అతిగా జరుగుతోందనే అభిప్రాయం కూడా ఉంది. కానీ బ్రిటన్ లో వెలుగుచూసిన సర్వే చూస్తే ఎవరైనా భయపడి తీరాల్సిందే. ఈ మాత్రం ముందు జాగ్రత్తలు కూడా తీసుకోకపోయి ఉంటే.. అమెరికా, బ్రిటన్ లోనే లక్షల మంది మరణించి ఉండేవారని నిపుణులు తేల్చారు. 

 

కరోనా వైరస్ ను వందేళ్లకోసారి వచ్చే మహమ్మారిగా ప్రపంచం భావిస్తోంది. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూతో దీనికి పోలికలు కూడా మొదలైపోయాయి. అయితే ఇది అంతకంటే శక్తివంతమైనదే కాదూ.. భయంకరమైనది కూడా అంటున్నారు బ్రిటీష్ నిపుణులు. లండన్ ఇంపీరియల్ కాలేజ్ కు చెందిన నిపుణుల బృందం చేసిన సర్వేలో.. కరోనాకు సంబంధించిన కఠోరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల మందిని చంపేసే శక్తి కరోనా వైరస్ కు ఉందని తేలింది. 

 

అమెరికాలో 22 లక్షల మంది, బ్రిటన్లో 10 లక్షల మంది ప్రాణాలు బలితీసుకునేంత శక్తి కరోనాకు ఉందని సర్వే తేల్చింది. ప్రస్తుతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి.. మరణాల సంఖ్య తక్కువగా ఉందని, లేకపోతే జనం పిట్టల్లా రాలిపోయేవారని సర్వే భయంకరమైన వాస్తవాన్ని కళ్లకు కట్టింది. ఇక బ్రిటన్ ప్రభుత్వానికి కూడా చురకలు అంటించింది. బ్రిటన్ ఇప్పుడిప్పుడే కఠినమైన ఆంక్షలు విధిస్తోందని, అదే ఇంతకుముందు ఆదేశాలకే ఫిక్సై ఉంటే.. ఈపాటికి రెండున్నర లక్షల మంది బ్రిటీషర్లు చనిపోయేవారని అంచనా వేసింది. 

 

గత వారంలో బ్రిటన్లో కేవలం అనుమానితుల్ని మాత్రమే ఐసోలేట్ చేసింది. సామాజిక జీవనంపై పెద్దగా ఆంక్షలు విధించలేదు. అదే పరిస్థితి ఉంటే.. ఇప్పటికే బ్రిటన్ లో  రెండున్నర లక్షల మరణాలు సంభవించేవని సర్వే అంచనా వేసింది. మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే కరోనాపై యుద్ధం ప్రకటించడంలో బ్రిటన్ బాగా ఆలస్యం చేసిందని ఇప్పటికే విమర్శలున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ముందే మేల్కొన్నా.. ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం చాలా లేట్ చేశారని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్లో ఇప్పుడిప్పుడే కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజా జీవనంపై ఆంక్షలు విధించడంతో పాటు 70 ఏళ్లకు పై బడ్డ వృద్ధులు స్వచ్ఛందంగా ఐసోలేట్ అవ్వాలని బోరిస్ జాన్సన్ సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: