దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 39కు చేరగా ఏపీలో 8 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వాలు పలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో మరో మూడు వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కానున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 
 
ఏపీ సీఎస్ నీలంసాహ్ని ఈరోజు కూడా నిత్యావసర వస్తువుల సరఫరా కొనసాగుతుందని తెలిపారు. కూరగాయల మార్కెట్ల దగ్గర జనం గుంపులు గుంపులుగా వస్తూ ఉండటంతో జనసాంద్రతను తగ్గించడానికి పలు చోట్ల రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రైతు బజార్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 
 
వినియోగదారులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఈరోజు నుండి హైకోర్టుకు సెలవులు ఉంటాయని చెప్పారు. అత్యవసర పిటిషన్లను ఈ నెల 27, 31 తేదీల్లో హైకోర్టు విచారించనుంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. తెలంగాణలో కరోనా కేసులు 39కు చేరాయి. 
 
ప్రభుత్వం కరోనా విస్తరించిన జిల్లాలను జోన్లుగా విభజించనుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు భద్రాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ మూడు జిల్లాలలో ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఉండటంతో ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలో నిన్న అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. రాబోయే మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండనుంది.                

మరింత సమాచారం తెలుసుకోండి: