లేఆఫ్స్‌ పేరుతో వేల ఉద్యోగాల కోత... ఆర్థిక సంక్షోభంతో లక్షల ఉద్యోగాలు హుష్‌కాకి...!! ఇప్పుడు కరోనాతో ఏకంగా కోట్ల ఉద్యోగాలు హాంఫట్‌. ప్రత్యేకించి ఓ రంగమంటూ లేదు. అన్నింటా ఉద్యోగాల కోతే ! రానున్న కొద్దిరోజుల్లోనే కోట్ల ఉద్యోగాలు మింగేయనుంది కరోనా మహమ్మారి. దీంతో.. ఉద్యోగుల్లో కరోనాని మించిన గుబులు పట్టుకుంది. 


కరోనా ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అగ్రరాజ్యం అమెరికానూ షేక్ చేస్తోంది. ఇటలీ, స్పెయిన్‌వంటి దేశాల్లోనే మరణమృదంగమే. భారత్‌లోనూ శరవేగంగా వ్యాపించింది కరోనా మహమ్మారి. మనుషుల ప్రాణాలనే కాదు... కోట్లాది ఉద్యోగాలనూ మింగేస్తోంది కరోనా రక్కసి. 

 

ఇప్పటికే అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు ఊడిపోయాయి. భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి.. బ్యాక్‌ టూ పెవీలియన్‌ అంటూ బ్యాగులు చేతపట్టుకుని స్వదేశం వైపు అడుగులేస్తున్నారు. పోనీ... భారత్‌లో ఐనా ఉద్యోగాలు సేఫా అంటే.. అంతకుమించిన ప్రమాదమే పొంచి ఉంది. 

 

బడ్డీకొట్లు మొదలుకుని.. మల్టీనేషనల్‌ కంపెనీలను నిలువునా ముంచేసింది కరోనా రక్కసి. రోజుకు కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. కొన్ని ఇండస్ట్రీలను కోలుకోలేనంత దెబ్బకొట్టింది. నష్టాలను పూడ్చుకోలేక... కంపెనీలను నడపలేక... ఉద్యోగాల కోతే లక్ష్యంగా పెట్టుకున్నాయి వేలాది కంపెనీలు. ఆ ఇండస్ట్రీ... ఈ రంగం అనే తేడానే లేదు. ఉద్యోగాల కోతే ప్రధానాస్త్రంగా మారింది.

 

ఇప్పటికే రెండు నెలల వ్యవధిలోనే అమెరికాలో కోటికిపైగా ఉద్యోగాలు ఊడాయి. మార్చి మొదటివారంలోనే 7 లక్షల ఉద్యోగాలు పోయాయి.. ఈ నెలాఖరులోగా మరో రెండు కోట్ల ఉద్యోగాలు హుష్‌ కాకి. అమెరికాలో హెచ్‌1 బీ వీసా ఉన్నవాళ్లు 4 లక్షలయితే.. అందులో సగం మంది తెలుగువాళ్లే. వాళ్లంతా బ్యాక్‌ టూ పెవీలియనే. 

 

ఆస్ట్రేలియాలోనూ సేమ్‌ సీన్‌. థర్డ్‌ స్టేజ్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అక్కడా వేలాది భారతీయుల ఉద్యోగాలు ఊడాయి. వేరే దేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేదు. ఇండియా తిరిగి వచ్చినా... ఆస్ట్రేలియా స్థాయి ప్యాకేజ్‌ ఇక్కడ దొరకడం చాలా కష్టం. మిగతా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. 

 

బ్రిటన్‌ విషయానికొస్తే.. రెండు వారాల్లోనే 10 లక్షల మంది , బతుకుదెరువు కష్టంగా ఉందని... తమ సంక్షేమం కూడా చూసుకోవాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.. దీంతో... అక్కడి కంపెనీలు.. 27 శాతం మంది ఉద్యోగుల జీతాల్లో కోతపెట్టాయి.

 

లాక్‌డౌన్‌తో షాపింగ్‌ మాల్స్‌, రిటైల్‌ దుకాణాలు మూతపడ్డాయి. ఆదాయం భారీగా క్షీణించింది. రానున్న రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు కోత ఖాయమంటోంది రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఏకంగా 136 మిలియన్ల ఉద్యోగాలు కోత పడే ప్రమాదముంటుందంటున్నారు. ప్రతీ మూడు ఔట్ లెట్స్ లో 
ఒకటి మూతపడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. 

 

భారత్‌లో 15 లక్షలకుపైగా ఉన్న ఆధునిక రిటైల్‌ దుకాణాల ద్వారా...సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. వీటిద్వారా 60 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. లాక్‌డౌన్‌తో వీరంతా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ముంచుకొచ్చింది. 

 

టూరిజం ఇండస్ట్రీనీ కరోనా వదల్లేదు. గతేడాది ఒక్క తాజ్‌మహల్‌ ని వీక్షించడానికే 10 మిలియన్ల మంది వచ్చారని... ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఒక్కరు కూడా వచ్చే పరిస్థితి లేదంటోంది ఓ టూరిజం ఏజెన్సీ. సో... 6 నెలలపాటు తమకు ఎలాంటి ఆదాయం లేకపోయినా ఉద్యోగులకు మాత్రం జీతాలివ్వాల్సిందే. ఇన్ని కష్టాలెదుర్కునేకంటే... ఉద్యోగుల కోతే సరైన మార్గంగా భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: