ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరోసారి గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం రేపటినుండి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వం అధికారులకు మే 1వ తేదీలోపు గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. 
 
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా వాలంటీర్ల వ్యవస్థను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపిక అయిన తరువాత కొందరు వివిధ కారణాల వల్ల ఉద్యోగాలకు రాజీనామా చేయడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. 
 
కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత నెల నుంచి వాలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తోంది. అయితే పలు ప్రాంతాల్లో వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో సర్వేకు ఆటంకం కలుగుతోంది. దీంతో వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు స్థానికంగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. 
 
అధికార వర్గాల లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 5,200, పట్టణ ప్రాంతాల్లో 5,500 ఉద్యోగాలు భర్తీ కానున్నాయని సమాచారం. అధికారులు స్థానికంగా విడుదలయ్యే నోటిఫికేషన్ లో ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు వాలంటీర్ల ఎంపిక సమయంలో 50 శాతం పోస్టులను రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.  ఏపీ ప్రభుత్వం మరోసారి గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: