కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి  ర్యాపిడ్ టెస్ట్ కిట్లుకొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కిట్ల ద్వారా కరోనా పాజిటివ్ కేసులను త్వరగా గుర్తించే వీలుంది. ఈ క్రమంలోనే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో జగన్ సర్కారు అవినీతికి తెరతీసిందనే ఆరోపణలు వచ్చాయి. బీజేపీ నేతలతో పాటు టీడీపీ వాళ్ళు కూడా జగన్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

 

కరోనా కిట్లను దక్షిణకొరియా నుంచి అదనంగా జీఎస్టీతో కలిపి ఒక్కోదాన్ని రూ.337లకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని కన్నా లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అదే దక్షిణ కొరియా నుంచి తెప్పించిన లక్ష కిట్లు ఎంతకు తెచ్చారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రెండు కిట్ల రేట్లలో తేడాని ప్రజలకు చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు.

 

ఇక ఇవే ప్రశ్నలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేశినేని కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. శవాల మీద పైసలు ఏరుకోవడం అంటే ఇదే అని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ నాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. టెస్టింగ్ కిట్ల ధర కాదు, క్వాలిటీ చూడాలని, ఏపీ ప్రభుత్వాన్ని ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు కూడా అభినందిస్తున్నారని, గుంటూరులో కూర్చొని కొందరు ప్రచారం కోసం పాకులాడుతున్నారని కన్నాని ఉద్దేశిస్తూ వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎంపీ విజయసాయి అయితే కన్నా, చంద్రబాబుకు అమ్ముడుపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అయితే బీజేపీ, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కిట్లని తక్కువ ధరకే కొనుగోలు చేశామని, అయితే తుది ధర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. పైగా క్వాలిటీ ఉన్న కిట్లని దిగుమతి చేసుకున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా ఈ కరోనా కిట్ల రగడ తగ్గాలంటే ప్రభుత్వం అసలు ధర బయటపెడితేనే మంచిదని విశ్లేషుకులు అంటున్నారు. . 

మరింత సమాచారం తెలుసుకోండి: