ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్‌పై ఓ రేంజ్ లో రాజకీయం జరుగుతుంది. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతలు కరోనాని అడ్డం పెట్టుకుని మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఓ వైపు  కరోనాని కట్టడి చేస్తూనే, మరోవైపు టీడీపీ చేసే విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ నేతలకు వేరే పని లేదు కాబట్టి, ప్రతిరోజూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అసలు ప్రతిరోజూ టీడీపీ నేతలు వరుసగా మీడియా సమావేశాలు పెట్టడం, కరోనా కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు జగన్ పై విమర్శలు చేయడానికి పోటీపడుతున్నారు. మొదట నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎక్కడ అఖిలప్రియ ఆధిపత్యం పెరిగిపోతుందనే ఉద్దేశంతో సీనియర్ నేత కోట్ల సుర్య్రప్రకాశ్ రెడ్డి రంగంలోకి దిగేసి, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా పెట్టుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

 

తాజాగా కూడా ఈ ఇద్దరు మీడియా ముందుకు వచ్చేసి, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరోనాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కరోనా మృతదేహాలను దహనం చేయాలని కేంద్రం చెప్పిందని, జిల్లాల్లో అధికారులు మాత్రం పూడ్చిపెడుతున్నారని అఖిల అన్నారు. ఇంకా పొన్నాపురం గ్రామ సచివాలయంలో డ్యాన్స్‌లు వేసిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఇక కోట్ల వెంటనే లైన్ లోకి వచ్చి, కేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు.

 

కర్నూలు జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కర్నూలులో కరోనా పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపాలని అడిగారు. అయితే ఈ ఇద్దరు నేతలు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారు. ఇక పనిలో పనిగా కర్నూలు జిల్లాలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే వీరు కరోనాని అడ్డం పెట్టుకుని మరీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: