కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ ను మరోసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందరి అభిప్రాయాల మేరకే కేంద్రం నిర్ణయం ఉంటుందని అన్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వలస కార్మికులకు పని కల్పించేందుకే సడలింపులు ఇచ్ఛామని పేర్కొన్నారు. 
 
హాట్ స్పాట్లు లేని ప్రాంతాలలో పరిశ్రమలకు అనుమతిలిచ్చామని తెలిపారు. పేదవాళ్లకు రవాణా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పాసులు అందిస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్, భౌతిక దూరం తోనే కరోనాను ఎదుర్కోగలమని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో వలస కార్మికులను, విద్యార్థులను, పర్యాటకులను పంపించాలని తెలిపారు. 
 
వలస కార్మికులను మానవీయ కోణంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రవాణా కోసం నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరిస్తుందని అన్నారు. ఆన్ లైన్ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. దేశంలో పలు రాష్ట్రాలలో కొత్త కేసులు నమోదు కావడం లేదని తెలిపారు. 
 
పలు రాష్ట్రాల్లో వలస కార్మికులు నోడల్ ఏజెన్సీల సహాయ సహకారాలతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి చాలా మంది వలస కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. లాక్ డౌన్ ఎప్పటివరకు పొడిగిస్తారో తాను చెప్పలేనని అన్నారు. అధికారికంగా లాక్ డౌన్ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోలేదని... మెజారిటీ వర్గాల అభిప్రాయం ప్రకారం లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 31,000 కు చేరగా మృతుల సంఖ్య 1000 దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: